Gussadi Kankaraju : తెలంగాణ కళాకారుడు, గుస్సాడీ నృత్యానికి వన్నె తెచ్చిన కనకరాజు (Kanakaraju) కన్నుమూశారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన ఆయన 70 ఏండ్ల వయసులో అనారోగ్యంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. రేపు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే ఆయన ఈసారి పండగ ముందే మృత్యుఒడికి చేరడంతో ఆదివాసీ గూడేల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి 2021 లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రదానం చేసింది.
అసిఫాబాద్‌లోని ఆదివాసీ బిడ్డల నృత్య రూపకమైన గుస్సాడీకి కనకరాజు ఎనలేని కీర్తిని తెచ్చారు. తమ అస్తిత్వ కళారూపాన్ని ఆయన తరచూ ప్రదర్శిస్తూ భావి తరాలకు తమ ఆచార, సంప్రదాయాలను తెలియజేశారు. దాంతో, ఆయన పేరు గుస్సాడీ కనకరాజుగా స్థిరపడిపోయింది. ఆదివాసీల కళను బతికిస్తూ.. అందులోనే ఆనందాన్ని వెతుక్కున్న ఆయన పేరును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేసింది. 2021 నవంబర్ 9వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ చేతుల మీదుగా ఆయన దేశపు నాలుగో అత్యున్నత అవార్డు అయిన పద్మశ్రీని అందుకున్నారు.
కుమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలానికి 4 కిలోమీటర్ల దూరంలో గుట్టపైన ఉన్న గిరిపల్లె మర్లవాయి కనకరాజు స్వగ్రామం. రాము, రాజు భాయిలకు ఆయన ఏకైక సంతానం. అప్పట్లో వాళ్లకు దగ్గర్లో బడి లేదు. అయితే.. ఓ మాస్టారు దగ్గర కనకరాజు మరాఠీ వర్ణమాల నేర్చుకున్నారంతే. బాల్యంలో ఆయన తండ్రికి వ్యవసాయం పనుల్లో సాయం చేసేవారు. కాస్త పెద్దయ్యాక కనకరాజు గుస్సాడీ మీద ప్రేమ పెంచుకున్నాడు. పూర్వీకుల నుంచి సంప్రదాయంగా వస్తున్న ఆ నృత్యాన్ని ఆయన దైవ స్వరూపంగా భావించారు.
గుస్సాడీ డాన్స్‌కు చెచోయ్ అనే పేరు కూడా ఉంది. ఈ నృత్యాన్ని దండారి పండుగ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఇక.. దాదాపు 50 ఏండ్లుగా గుస్సాడీయే శ్వాసగా బతికిన కనకరాజు పలు ప్రదర్శనలు ఇచ్చారు. అంతేకాదు ఓ స్కూల్ ఏర్పాటు చేసి ఆసక్తిగత యువతకు ఆయన మెలకువలు నేర్పారు. ధోతీ, రుమాలు కట్టుకొని.. తలపై నెమలి ఈకల టోపీ పెట్టుకొని, మెడలో పూల దండలు వేసుకొని చేతిలో గంగారం సోట అనే కర్ర పట్టుకుంటారు. డోలు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ అందర్నీ సంస్కృతిలో భాగం చేస్తారు.