కేపీహెచ్‌బీ కాలనీ (హైదరాబాద్) : ప్రజల బాగోగులను పట్టించుకోవడంలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram Krishna Rao) ఆరోపించారు. శుక్రవారం కూకట్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ (BRS) ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR), మాజీ మంత్రి కేటీఆర్(KTR) నాయకత్వంలో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందని, పేదలందరికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు మర్చిపోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదినెలలైందని, నేటికి ప్రజల కష్టాలను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు విసిగెత్తిపోయారన్నారని, ఎన్నికలలో ఇచ్చిన హామిలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాలనీలు, బస్తీలలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌రాయ్, మాజీ అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.