న్యూఢిల్లీ: కొందరు యువతులతో కూడిన ఒక ముఠా డేటింగ్ పేరుతో అబ్బాయిలకు వల వేస్తున్నారు. వారిని ఒక హోటల్‌కు రప్పిస్తున్నారు. కూల్ డ్రింక్, ఫుడ్ కోసం వేలల్లో వసూలు చేస్తున్నారు. కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. (Dating Fraud) ఒక బాధితుడి ఫిర్యాదుతో ఐదుగురు యువతులతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 21న ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తికి డేటింగ్ పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కలుద్దామని ఒక యువతి చెప్పింది.
కాగా, అక్కడకు వెళ్లిన ఆ వ్యక్తి కౌశాంబి మెట్రో స్టేషన్లో ఒక అమ్మాయిని కలిశాడు. కౌశాంబి హోటల్ మొదటి అంతస్తులోని టైగర్ కేఫ్‌కు అతడ్ని ఆమె తీసుకెళ్లింది. సైన్బోర్డ్ లేని ఆ కేఫ్‌ను చూడగానే ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. దీంతో తన లైవ్ లొకేషన్‌ను స్నేహితుడికి షేర్ చేశాడు. తాను డేంజర్లో ఉన్నట్లు మెసేజ్ పంపాడు. ఇంతలో ఆ యువతి కూల్ డ్రింక్ ఆర్డర్ చేసింది. దాని కోసం రూ.16,400 బిల్లు ఇవ్వడం చూసి అతడు షాక్ అయ్యాడు. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా అతడ్ని బలవంతంగా అడ్డుకున్నారు. ఆ కేఫ్‌లో నిర్బంధించి రూ.50,000 డిమాండ్ చేశారు.
మరోవైపు ఆ వ్యక్తి మెసేజ్ చూసిన అతడి స్నేహితుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. తన స్నేహితుడు కిడ్నాప్ అయ్యాడని చెప్పాడు. అతడి లొకేషన్ షేర్ చేశాడు. దీంతో పోలీసులు టైగర్ కేఫ్ వద్దకు చేరుకున్నారు. ఆ వ్యక్తిని రక్షించారు. డేటింగ్ పేరుతో అబ్బాయిలను అక్కడకు రప్పించి డబ్బులు డిమాండ్ చేసి మోసగిస్తున్న ఆ ముఠాను పట్టుకున్నారు. ఐదుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన నలుగురు అమ్మాయిల ప్రొఫైల్స్ అన్ని డేటింగ్ యాప్స్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.