KTR | రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ అంటేనే పోరాట స్ఫూర్తికి ప్రతీక. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆమె చూపిన తెగువ మనందరికి ఆదర్శం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో నిత్య స్మరణీయురాలు ఐలమ్మ. బహుజనులు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వామ్యం కావటానికి ఆమెనే స్ఫూర్తి. ఉద్యమ పోరాటాల్లో మహిళల పాత్ర అసమానమైనది అని చాటి చెప్పిన యోధురాలు ఐలమ్మ. ఇవ్వాళ ఆమె జయంతి సందర్భంగా ఆ మహనీయురాలిని స్మరించుకోవటం గొప్ప అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఐలమ్మ పోరాట స్ఫూర్తి, ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పాలన సాగింది. బడుగులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తూ ఐలమ్మను ఘనంగా స్మరించుకున్నాం. చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా చేర్చారు. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టారు. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఐలమ్మ ఆకాంక్షలను నిత్యం ముందుకు తీసుకెళ్లటంలో బీఆర్ఎస్ ముందుంటుంది. పేదలు, బడుగుల కోసం పరితపించిన ఐలమ్మ ఆశయాలను కొనసాగించటమే ఆమెకు మనమిచ్చే ఘన నివాళి అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
KTR | బీజేపీ, కాంగ్రెస్ ఒక నాణేనికి రెండు ముఖల్లాంటివి.. కపిల్ సిబల్కు కేటీఆర్ కౌంటర్
Musi River | మూసీ నది పరివాహక ప్రాంతంలో సర్వే.. అధికారులను అడ్డుకున్న స్థానికులు