ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 01, 2020 , 23:32:06

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో బురిడీ

కేవైసీ అప్‌డేట్‌ పేరుతో బురిడీ

  • రూ.5.4లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా నేపథ్యంలో అందరూ ఇండ్లల్లోనే ఉంటుండగా.. సైబర్‌ నేరగాళ్లు మాత్రం కేవైసీ అప్‌డేట్‌ పేరుతో పలువురికి టోకరా వేశారు. ఒకే రోజు ముగ్గురి నుంచి లక్షల రూపాయలను సైబర్‌ నేరగాళ్లు కొట్టేశారు. అలాగే రుణం పేరుతో మరో వ్యక్తిని బురిడీ కొట్టించారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

  • సైబర్‌ నేరగాళ్లు ఫార్మసీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే విద్యానగర్‌కు చెందిన వ్యక్తికి ఫోన్‌చేసి మీరు కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలని, లేకుంటే మీ ఖాతా క్లోజ్‌ అవుతుందంటూ భయపెట్టారు. మీరు క్విక్‌ సపోర్టు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అన్ని వివరాలు అందులో పొందుపర్చితే వెంటనే అప్‌డేట్‌ చేస్తామని నమ్మించారు. నిజమేనని నమ్మిన బాధితుడు వివరాలు పంపగానే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5లక్షలు కాజేశారు. 
  • గాంధీనగర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా సైబర్‌నేరగాళ్లు ఫోన్‌చేసి కేవైసీ అప్‌డేట్‌ పేరుతో రూ. 1.5 లక్షలు కాజేశారు
  • మూసబౌలికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగికి మీ పేటీఎం కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాలంటూ అతని బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 1.7 లక్షలు కొట్టేశారు. 
  • మరో ఘటనలో రుణం ఇస్తామంటూ నమ్మించి చిక్కడపల్లికి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి నుంచి రూ.70 వేలు కాజేశారు. 


logo