Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లు అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. అనంతరం సీఎం వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభలాబీ నుంచి మీడియా పాయింట్ వరకు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత మీడియా పాయింట్ వద్ద సబితా ఇంద్రారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభలో తన పేరును ప్రస్తావించి.. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. దొంగల్లా పారిపోయారంటూ మండిపడ్డారు. సభలో సభ్యులను అవమానిస్తున్నారని.. ఏం మొహం పెట్టుకొని వచ్చారంటారా?.. పార్టీ మారానని అడిగి హక్కు మీకెక్కడిదంటూ నిలదీశారు. తాను పార్టీ మారలేదని.. గెంటివేశారన్నారు. దేశంలో చాలామంది పార్టీలు మారుతారన్నారు.
రేవంత్‌రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని.. అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుందననారు. మీ వెనకున్న అక్కలే మిమ్మల్ని ముంచారని సీఎం అన్నారని.. మిమ్మల్ని కూడా ముంచుతారని కేటీఆర్‌తో సీఎం అన్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నోటికి ఏదొస్తే మాట్లాడుతున్నారన్నారు. సోనియా మొదలు సబిత వరకు అందరిపై సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. మహిళలపై సీఎంకు గౌరవం లేదు.. ఏం మాట్లాడాలో కూడా తెలియదన్నారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి రాకముందే ఆ పార్టీకి మేం సేవలందించామన్నారు. నేను, సునీత పార్టీకి మోసం చేశామని రేవంత్ మాట్లాడారన్నారు. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరడమే నేను చేసిన తప్పు అన్నారు. ఆడబిడ్డలు, క్షేమం కోరుకుంటారు.. నమ్మిచన వారికి ప్రాణం ఇస్తారని.. ఈ రోజు జరిగిన అవమానం సునీత, సబితకు మాత్రమే కాదన్నారు. సభలో జరిగిన దానిపై ప్రతి ఇంట్లోని ఆడపిల్లలు ఆలోచిస్తున్నారని.. సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ రోజు నిండుసభలో ద్రౌపదిని అవమానించారని.. ఈ రోజు సభలో సబితను అవమానించారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం మాటలు మహిళలను గాయపరుస్తున్నాయని.. చేసిన తప్పునకు సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర మహిళలను అగౌరవపరిచేలా మాట్లాడారని.. మాకు మాట్లాడే అవకాశం కల్పిస్తారనుకున్నామని.. సభలో మాకు మైక్ ఇవ్వకుండా మా గొంతులు నొక్కేశారన్నారు. పార్టీ మారారని అంటున్నవాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆలోచించుకోవాలని హితవు పలికారు. తనను, సబిత, డీకే అరుణను పార్టీ నుంచి పంపించింది మీరు కాదా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని.. కాంగ్రెస్ పార్టీని మేం చేశామని సీతక్క అంటుందని.. సీతక్క ఏ పార్టీ నుంచి వచ్చిందంటూ సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.