Telangana Power | ఉద్యమ తెలంగాణ కన్న కలలన్నీ నిజం కావాలంటే ముందుగా కావల్సింది, అవసరమైంది అత్యంత కీలకమైంది విద్యుత్తు. ‘తెలంగాణొస్తే ఏమొస్తుంది? తగినంత కరెంటు లేక చీకట్లో మగ్గిపోతుంది’ అని సాక్షాత్తు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ర తిప్పుతూ చెప్పిన మాటలు ఏ తెలంగాణ వాది మరిచిపోగలడు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తురంగ పునర్నిర్మాణం ఏ దశ నుంచి మొదలైందో అర్థం కావడానికి ఆ నాటి ఈ సంఘటన గుర్తు చేసుకుంటే చాలు….
తెలంగాణ ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ సాకారం కావాలంటే ముందుగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయవలసింది విద్యుత్తురంగమే అన్న అవగాహన ఉన్న దార్శనికుడు, ఉద్యమనాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం. అందుకే విద్యుత్తురంగ అభివృద్ధికి తొలి ప్రాధాన్యాన్ని ఇచ్చి విస్తృత మేధోమథనం జరిపారు. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రంగాలకు వేలాది కోట్ల రూపాయల నిధులను వెచ్చించి అప్పటికే అందుబాటులో ఉన్న సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తే తప్ప నిరంతర విద్యుత్తు సాధ్యపడలేదు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా విద్యుత్తు రంగాన్ని అభివృద్ధి చేసుకోవడం వల్లనే వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్తు సాధ్యపడింది.
మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ర్టాల్లో కూడా ఇప్పటికీ అక్కడి ప్రభుత్వాలు రైతులకు పగటిపూట ఏడు గంటల కరెంటు అందించడానికి ఆపసోపాలు పడుతున్నాయి. గుజరాత్లో చేపట్టిన ‘సూర్యోదయ కిసాన్ యోజన’ పథకం ఇప్పటికీ సాకారం కాలేదు. దేశంలోనే అత్యధిక జీడీపీ కలిగిన మహారాష్ట్రలోని రైతుల కష్టాలు అందరికీ తెలిసినవే. తరచూ రైతు ఆత్మహత్యలతో అల్లాడిపోతున్నది. దేశంలోని మరే రాష్ట్రం సాధించని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు ఎలా సాధ్యపడిందో ఉత్పత్తి, సరఫరా, పంపిణీ రంగాలవారీగా కింద పేర్కొన్న ప్రగతి పట్టికను ఒకసారి విశ్లేషించుకుంటే అర్థమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వ్యవసాయరంగానికి విద్యుత్తు ప్రధాన చర్చనీయాంశమైంది. ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఒకరు వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని, రైతులు 10 హెచ్‌పీ మోటర్లు వాడుకుంటే చిన్న చిన్న కమతాలుగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మూడు గంటల కరెంటు కంటే ఎక్కువ అవసరం ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వ్యవసాయరంగానికి 6 గంటల కరెంటు రెండు, మూడు విడతలుగా ఇచ్చేవారు. దాని పరిణామాలు పంట నష్టాలు, రైతు ఆత్మహత్యలు, సబ్స్టేషన్ల ముందు ధర్నాలు, రాస్తారోకోలు, కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. ఇవన్నీ పచ్చిగా కండ్లముందు కదలాడే మరిచిపోలేని దృశ్యాలు, అనుభవాలు.
ప్రస్తుతం రాష్ట్రంలో 27 లక్షల 48 వేల వ్యవసాయ పంపుసెట్ల ద్వారా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. రాష్ట్ర విద్యుత్తు వినియోగంలో సుమారు 31 శాతానికి పైగా వ్యవసాయరంగానికే పోతున్నది. రైతులకు ఉచితంగా కరెంటును అందించడం జరుగుతున్నది. 95 శాతానికి పైగా రైతులు 5 హెచ్‌పీ మోటర్లను వాడుతారు. ఎక్కడో ఒకచోట 7.5 హెచ్‌పీ మోటర్లు అతి తక్కువగా ఉపయోగిస్తారు. మనకున్న భూగర్భ జలాల లభ్యత రీత్యా 5 హెచ్‌పీ మోటర్లనే రైతులు వినియోగిస్తున్నారు. ఒక హెచ్‌పీ 745 వాట్లకు సమానం. అంటే 5 హెచ్‌పీ మోటర్ 3.725 కిలోవాట్లకు సమానమన్న మాట- ఈ లెక్కన రైతులు ఉపయోగిస్తున్న పంపు మోటర్ల సామర్థ్యం 11,000 మెగావాట్లు- అంటే గంటకు ఒక కోటి పది లక్షల యూనిట్ల విద్యుత్తు వినియోగం- గతంలో విడతల వారీగా వ్యవసాయరంగానికి ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే రైతులు పగలు తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వడానికి అప్పటికే అందుబాటులో సబ్స్టేషన్లు లైన్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాల్సి వచ్చింది. అందుకుగాను సుమారు 30 వేల కోట్ల రూపాయలు వెచ్చించి అదనంగా 33/11 కేవీ సబ్స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ల సామర్థ్యం పెంచుకోవడం, కొత్త 11 కేవీ ఫీడర్ల నిర్మాణం ఇత్యాది పనులను పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చెప్పొచ్చేదేమంటే ఇప్పుడు ఉన్నపళంగా 5 హెచ్‌పీ మోటర్ల స్థానంలో 10 హెచ్‌పీ మోటర్లను బిగించవలసి వస్తే ఎలాంటి సాంకేతిక, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయో చర్చించుకుందాం.
27 లక్షల 48 వేల వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం 5 హెచ్పీతో లెక్కించినప్పుడు 11 వేల మెగావాట్లుగా ఉంటుం ది. 10 హెచ్‌పీ మోటర్లుగా మార్చినట్లయితే 22 వేల మెగావాట్లు డిమాండు సరఫరా చేయాలి. ఇప్పటివరకు అన్నిరంగాలు కలిపి మన రాష్ట్ర పీక్ 15,497 మెగావాట్లుగా నమోదైంది. మరి 22 వేల మెగావాట్లు వ్యవసాయరంగ లోడ్ అయినప్పుడు ఆ మేరకు ఉత్పత్తి, పంపిణీ సరఫరా రంగాల సామర్థ్యాన్ని పెంచుకోవడం సాధ్యమయ్యే పనేనా? అందుకవసరమైన సుమారు 50 వేల కోట్ల భారీ నిధుల సేకరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందా? మార్కెట్లో 10 హెచ్‌పీ మోటర్ పంపు ఖరీదు సుమారు 70 వేలుగా ఉన్నది. 27 లక్షల 48 వేల పంపుసెట్లను మార్చడానికి అవసరమైన సుమారు రూ.18,900 కోట్లను ఎలా సమకూర్చుకుంటారు?
విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకోవడం ఉన్నపలంగా సాధ్యం కాదు. ఏండ్ల తరబడి కొనసాగే ప్రక్రియ ఒక మెగావాట్ విద్యుత్తు ఉత్పత్తికి 6-7 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. 400 కేవీ, 220, 132 కేవీ, 33/11 కేవీ సబ్-స్టేషన్ల సామర్థ్యం రెట్టింపు చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్టేషన్ల నుంచి వచ్చే 11 కేవీ ఫీడర్ల సామర్థ్యం సరిపోదు కాబట్టి నూతనంగా ఇప్పుడున్న సంఖ్యకు ఇంచుమించు సమానస్థాయిలో నూతనంగా 11 కేవీ ఫీడర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవాలి. అంటే 100 కేవీఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో మరొక 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ అయినా పెట్టాలి లేదా దానిస్థాయిలో 200 కేవీఏ ట్రాన్స్ఫార్మర్నైనా పెట్టాలి. వ్యవసాయరంగానికే సుమారు 4 లక్షలకు పైగా వివిధ కెపాసిటీలకు చెందిన డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లున్నాయి మన రాష్ట్రంలో. రైతులు కూడా స్టార్టర్లు, వైర్లు అన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. నిరంతర కరెంటు అందుబాటులో ఉండటం వల్ల రైతులకు లో ఓల్టేజీ సమస్య లేదు. అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు. అలా కాకుండా నిర్ణీత సమయంలోనే కరెంటు ఇచ్చినట్టయితే మోటర్లన్నీ ఒక్కసారే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే రైతులందరూ ఆటోమేటిక్ స్టార్టర్లు అమర్చుకుంటారు. దాని వల్ల గ్రిడ్‌పై ఒక్కసారిగా భారం పడుతుంది. మొదటిలాగే తరచుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, వైర్లు తెగిపోవడం, ఫ్యూజులు ఎగిరిపోవడం లాంటి సమస్యలు షరామామూలే.
కేంద్రం తీసుకురానున్న విద్యుత్తు సవరణ బిల్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వద్ద పరిశీలనలో ఉన్నది. ఒక్కసారి చట్టం అమలుకు నోచుకున్నట్టయితే వ్యవసాయరంగం పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉన్నది. దేశంలోని 29 రాష్ర్టాల్లో దేశంలోని మరే రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తు నిరంతరాయంగా 24 గంటలు అందించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం సాధించిన అద్భుత విజయాల్లో విద్యుత్తు రంగం ముఖ్యమైనదనే విషయం అంగీకరించాల్సిన చరిత్ర.
10 హెచ్‌పీ మోటర్ 3 గంటలు పనిచేస్తే చాలనుకుందాం. ప్రస్తుతం ఉన్న 5 హెచ్‌పీ మోటర్లకు 2014కు పూర్వం 6 గంటల కరెంటును ఇచ్చారు కదా? మరి అలాంటప్పుడు కరెంటు కోతలు, పంటలు ఎండిపోవడం, మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం లాంటి సమస్యలు ఎందుకున్నట్టు? 10 హెచ్పీతో మూడు గంటల కరెంటు సరిపోయినప్పుడు 5 హెచ్పీతో ఆరు గంటల కరెంటు ఎందుకు సరిపోలేదో చెప్పాలి?
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. ఉద్యమం పొడగునా కలలు- ‘తెలంగాణొస్తే మన వ్యవసాయరంగానికి, పల్లెలకు నిరంతర సరఫరా అందిం చవచ్చు, భారీ ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించుకొని గోదావరి, కృష్ణా నీళ్లను రాష్ట్రం నలుచెరుగులా పారించి పాడి పంటలతో పచ్చగా మెరిసిపోయే తెలంగాణను సాకారం చేసుకోవచ్చు. మన పరిశ్రమలకు అంతరాయాల్లేని నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందించి తెలంగాణను పరిశ్రమల పెట్టుబడులకు చిరునామాగా రూపొందించవచ్చు.
హెచ్‌వీడీఎస్ హై ఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్ ఓల్టేజీ సిస్టంలో భాగంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సహకారంతో వ్యవసాయరంగానికి 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు బిగించి ఐదేసి బోర్లకు కరెంటు ఇవ్వడం జరుగుతున్నది. 5 హెచ్‌పీ X ఐదు బోర్లు అంటే 25 కేవీఏ అన్నమాట.మరి 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాల్సి వస్తే 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లను 50 కేవీఏకి పెంచాలి. లేదా అదనంగా 25 కేవీఏ మరొకటి. ట్రాన్స్ ఫార్మ ర్ను బిగించాలి. అత్యంత ఖర్చు తో కూడుకున్న వ్యవహారం.
A Small body of determined spirits fired by an unquenchable faith in thair mission can alter the course of history.
– Mahathma Gandhi
-శశికళఠాకూర్