Dasoju Sravan | నాలుగు కోట్ల మంది ప్రజలున్న తెలంగాణలో రెండు కోట్లకు పైగా బీసీలు ఉన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. మెస్సీతో కాదు.. గుంపు మెస్త్రీ బీసీలతో ప్రతిరోజూ ఫుట్బాల్ ఆడుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీ ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీసీ బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, శ్రీనివాస్ గౌడ్, ఎల్.రమణతో కలిసి దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బీసీలను తడిగుడ్డ పెట్టి గొంతు కోసేలా ఉందని అన్నారు. ప్రజా కోర్టులో రేవంత్ రెడ్డిని శిక్షించాలన్నారు.
బీసీ జాతి కోసం సాయి ఈశ్వర్ చారి బలిదానం చేసుకున్నాడని దాసోజు శ్రవణ్ తెలిపారు. ఆరు నెలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు ఇచ్చారని అన్నారు. అవినీతి కేసులపై పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకునే రేవంత్ రెడ్డి.. బీసీల హక్కులను కాపాడేందుకు పెద్ద పెద్ద లాయర్లను ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్లను ఎందుకు నియమించడం లేదని నిలదీశారు.ఫ్రాడ్ సిటీలో 150 కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి.. BC లకు ఇస్తామని చెప్పిన హామీల ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని తెలిపారు. రెండు, మూడో విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.