పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 13 : పెద్దపల్లి మండలంలోని రాంపల్లి (Rampally) గ్రామపంచాయతీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ పదవి కూడా ఏకగ్రీవమయ్యాయి. మూడో విడత ఎన్నికలకోసం డిసెంబర్ 3 నుంచి 5 వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే.. పెద్దపల్లి మండలం రాంపల్లి సర్పంచ్ స్థానానికి కనపర్తి సంపత్ రావు, కోదాటి దేవేందర్ రావులు నామినేషన్ దాఖలు చేశారు. చిన్న గ్రామం కావడం, ఇద్దరు మాత్రమే నామినేషన్ వేయడంతో గ్రామస్తులు ఒక ఆలోచనకు వచ్చి సర్పంచ్ గిరీని ఏకగ్రీవం చేయాలనుకున్నారు.
ఫలితంగా ఉపసంహరణ చివరి రోజున కోదాటి దేవెందర్ రావు పోటీనుంచి విరమించుకున్నారు. దాంతో, కనపర్తి సంపత్ రావుకు సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. అలాగే వార్డు స్థానాలను సైతం ఏకగ్రీవమయ్యేలా చేశారు గ్రామ ప్రముఖులు. అందువల్ల రాంపల్లి సర్పంచ్ పీఠం సహా పాలకవర్గం పోటీ లేకుండా ఎన్నికైంది.
ఉపసర్పంచ్‌గా జయమ్మకు మద్దతుగా చేతులెత్తిన వార్డు సభ్యులు

మిగిలిన ఉపసర్పంచ్ పదవిని సైతం ఏకగ్రీవం చేసేందుకు అడుగులు వేసి అందులోను విజయవంతమయ్యారు రాంపల్లి గ్రామస్తులు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి లింగంపల్లి దేవెందర్ శనివారం ఉపసర్పంచ్ ఎన్నికకు నోటీసులు జారీ చేసి సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీలో 8 మంది వార్డు సభ్యులు హాజరై ఉపసర్పంచ్ పోస్ట్‌ను కూడా ఏకగ్రీవమే చేద్దామనుకుని.. ఆరో వార్డుకు పోటీలో ఉన్న మడుపు జయలక్ష్మిని బలపరిచారు. అనంతరం రిటర్నింగ్ అధికారి చేతులెత్తే పద్దతిలో ఓటింగ్ నిర్వహించగా సభ్యులందరు కూడా జయలక్ష్మికి ఎన్నుకున్నారు. అనంతరం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తంజావూరు సోనియా, గ్రామస్తులు పాల్గొన్నారు.