US-Israel-Iran War : ఇప్పుడు ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా అనేక దేశాలు చమురు కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 90 డాలర్లకు మించి పెరిగింది. ఈ నేపథ్యంలో చమురు సరఫరా పెంచి, ధరల్ని నియంత్రించేందుకు వివిధ దేశాలు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు రిజర్వ్ను విడుదల చేస్తాయి. ఇప్పుడు జపాన్ అదే పని చేసింది. తమ దేశంలో ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను విడుదల చేయబోతున్నట్లు జపాన్ ప్రధాని సనాయే తకాయిచి బుధవారం వెల్లడించారు. ఈ నెల 16లోపు ఆయిల్ విడుదల చేస్తామని ఆమె ప్రకటించారు.
దీనివల్ల అంతర్జాతీయంగా చమురు ధరల స్థిరీకరణ జరుగుతుందని సికాయిచి అన్నారు. ఈ పనిచేసిన తొలి జీ7 దేశంగా జపాన్ నిలిచింది. చమురుకు సంబంధించి ఇలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు.. చమురును ఎక్కువగా వినియోగించే దేశాలు తమ దగ్గర ఉన్న ఆయిల్ రిజర్వ్స్ నుంచి కొంత విడుదల చేయాలనేది ఒక ఒప్పందం. దీనివల్ల ఇతర దేశాలకు సరఫరా పెంచి, ధరల్ని తగ్గించి, అక్కడి ప్రజలకు ఉపయోగపడేలా చేయొచ్చు. ఈ వ్యవహారాన్ని అంతా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) పర్యవేక్షిస్తుంది. ఇండియా కూడా గతంలో ఇలాగే ఆయిల్ రిజర్వ్స్ను విడుదల చేసింది. 2021లో అమెరికాతోపాటు ఇండియా ఆయిల్ విడుదల చేసింది. మన దగ్గర ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నుంచి 5 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. కానీ, ఇప్పుడు మాత్రం ఇండియా దీనికి దూరంగా ఉంటోంది. తాము ఐఈఏలో చేరడం లేదని ఇటీవలే ప్రకటించింది.
ఈ సంక్షోభానికి ఇండియా కారణం కాదని, బాధ్యులైన వారే ఈ సమస్యను పరిష్కరించాలని ఇండియా సూచించింది. ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటూ వినియోగిస్తున్న మూడో దేశం. మన దగ్గర ప్రస్తుతం 5.33 మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు అంచనా. అయితే, ఇది మన నిల్వ సామర్ధ్యంలో 80 శాతం మాత్రమే. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. అందులోనూ హోర్ముజ్ జలసంధి నుంచి రవాణా నిలిచిపోవడం, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు, అక్కడి చమురు క్షేత్రాలను ధ్వంసం చేయడం కారణంగా చమురు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.