Srinivas Goud | సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకున్నాడని.. అయినా వారి కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చలేదని మండిపడ్డారు. బీసీ బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర, ఎల్.రమణ, పొన్నాల లక్ష్మయ్యతో కలిసి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
బీసీలకు 42 రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త అయిన బీసీ వ్యక్తితో మూత్రం తాగించారని మండిపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
జనగణనలో బీసీలను తక్కువ చేసి చూపించారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చారో రాహుల్ గాంధీ తెలుసుకోవాలని సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి రాహుల్‌గాంధీకి చెప్పాలన్నారు. బీసీలను తక్కువ చేసి చూయించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ అమలుపై పార్లమెంట్లోఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను బొంద పెట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాహుల్‌గాంధీకి ఫుట్‌బాల్ మ్యాచ్ చూసే టైమ్ ఉంది కానీ.. బీసీలకు ఇచ్చిన హామీలపై లేదని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ బీసీలతో రోజూ ఫుట్‌బాల్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు.