మంగళవారం 26 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 03:42:27

బకాయిలు చెల్లిస్తేనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌

బకాయిలు చెల్లిస్తేనే ఆస్తుల రిజిస్ట్రేషన్‌

  • మున్సిపాలిటీలకు ధరణి మార్గదర్శకాలు జారీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయేతర భూముల గుర్తింపు, నిర్వహణ, రికార్డుల నవీకరణను మున్సిపాలిటీలు ఇకపై ధరణి పోర్టల్‌ ద్వారానే నిర్వహించాలి. ఈ మేరకు ధరణి పోర్టల్‌కు సంబంధించి మున్సిపాలిటీలు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం జారీచేసింది. మున్సిపల్‌ చట్టం 2019కి గతంలోనే సవరించిన ప్రభుత్వం, అందుకు సంబంధించిన విధివిధానాలను తాజాగా నిర్దేశించింది. తెలంగాణ మున్సిపాలిటీస్‌ రూల్స్‌ 2020 పేరిట రూపొందించిన ఈ నిబంధనలు గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహాయించి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తించనున్నాయి. మున్సిపాలిటీల్లోని వ్యవసాయేతర భూ ములు, వాటి వినియోగం, ఇండ్లు ఉంటే వాటి వివరాలు, ఆ భూములకు సంబంధించిన యజమానుల పేర్లు, విస్తీర్ణం, చిరునామా, మొబైల్‌నంబర్‌తోపాటు వారసుల వివరాలను నిర్ణీత నమూనాలో ధరణి పోర్టల్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలి. ధరణి పోర్టల్‌ నిబంధనలను అనుసరించి గృహ నిర్మాణ అనుమతులు, లేఅవుట్‌ అనుమతులు మంజూరుచేయాలి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవసాయేతర భూముల వివరాలను ఇందులో మినహాయించవచ్చు. ప్రభు త్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఇకపై మున్సిపాలిటీలోని వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలు, వారసత్వ బదిలీ, హక్కుల బదిలీ జరుగాలంటే నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ఇంటిపన్ను, నల్లా, విద్యుత్‌ తదితర బిల్లులన్నీ చెల్లిస్తేనే ఈ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేస్తారు. ఇక భూము లు, ఇండ్ల యజమానులు నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. ఎవరైనా సరే మున్సిపాలిటీ నుంచి నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ను పొందాలంటే ముందుగా సదరు భూమి, హక్కుదారు మున్సిపాలిటీకి రాతపూర్వకంగా, సంబంధిత పన్నుల బిల్లుల రసీదులను పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన అనంతరం నాలుగురోజుల్లోగా మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోడ్యూస్‌ సర్టిఫికెట్‌ జారీచేస్తుంది. దాని ఆధారంగానే మున్సిపాలిటీల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.


logo