హైదరాబాద్: గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. వరంగల్, హన్మకొండలో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికిలోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మహబూబాద్‌లోని ప్రభుత్వం దవాఖానలోకి వరద నీరు చేరింది. ఐసీయూలోని పది రోగులను సిబ్బంది మరో వార్డుకు తరలించారు. విజయవాడ నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న గూడ్సు రైలు డోర్నకల్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలపైనుంచి పక్కకు జరిగాయి. దీంతో సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ వ్యాగన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
ములుగు జిల్లాలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నది. జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో వాన పడుతున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. కొత్తగూడెం, మణుగూరు పరిసర ప్రాంతాల్లో భారీ వాన పడుతున్నది. దీంతో బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. జీకే ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తున్నది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. హుజూర్నగర్, కోదాడాలో సోమవారం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతున్నది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో భారీ వాన కురుస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్నది. దీంతో నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలతో గోదావరి, మంజీరా నదుల్లో ప్రవాహం పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలో వాన కురుస్తున్నది. జహీరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నది.
సోమవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతున్నది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, అంబర్‌పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంటలో ఉరుములతో కూడిన వర్షం కురుస్తున్నది.
హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లిలో వాన పడుతున్నది.