Patnam Narender Reddy | హైదరాబాద్ : తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ లగచర్ల ఘటనలో ఏ1 నిందితుడిగా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని గురువారం న్యాయవాదులు కలిశారు. న్యాయవాదుల ద్వారా కోర్టుకు నరేందర్ రెడ్డి అఫిడవిట్ పంపించారు.
బుధవారం ఉదయం కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు నా స్టేట్మెంట్ తీసుకోలేదు. కోర్టులో హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై నా సంతకాలు తీసుకున్నారు. నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు. అరెస్టుకు ముందు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. కేటీఆర్ సహా ఇతర ముఖ్యనేతల ఆదేశాలతో దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకథ చెప్పారు. నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పినవన్నీ నిజం కాదు. నా స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకొని విచారణ చేయాలి అని కోర్టుకు పంపించిన అఫిడవిట్లో నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు నరేందర్ రెడ్డిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
ఇవి కూడా చదవండి..
TGPSC | గ్రూప్-4 ఫలితాలు విడుదల
KTR | లగచర్ల ప్రజల తరపున న్యాయ పోరాటం చేస్తాం : కేటీఆర్