KTR | హైదరాబాద్ : లగచర్ల ప్రజల తరపున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ గ్రామ ప్రజలకు అండగా ఉంటాం.. తప్పకుండా ఆదుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో లగచర్ల బాధిత మహిళలతో కేటీఆర్ సమావేశమై వారి బాధలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లగచర్ల తండాల మహిళలు మాటలు విన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులను ఒక్కటే అడుగుతున్నా. మేం రెచ్చగొడితే, మేం పైసలు ఇస్తే కొట్లాడమంటే కొట్లాడేవారిలాగా వీళ్లు కనబడుతున్నారా..? బాధిత మహిళలు ఇంత స్పష్టంగా, డైరెక్ట్‌గా చెబుతున్నారు. భూములు తీసుకుంటామని నోటీసులు ఇవ్వలేదు. చెప్పలేదు. ఫార్మా కంపెనీ వల్ల లాభం ఏంటో చెప్పలేదు. 9 నెలల నుంచి ఆందోళన చేస్తుంటే ఏ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత మరుసటి నెల నుంచి పంచాయితీ జరుగుతుందని బాధిత మహిళలు తెలుపుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ తరపున మాట ఇస్తున్నాం. మీ మనువండ్లు, పిల్లలు, భర్తలు ఇంటికి తిరిగి వచ్చే దాకా మేం చూసుకుంటాం. అండగా నిలబడుతాం. ఆందోళన చెందకండి.. కోర్టుకు పోయి కొట్లాడుతాం. అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం అంటే ఊరుకోమని మహిళలు చెబుతున్నారు. జానెడు భూమి కోసం తలలు పగులగొట్టుకుంటాం.. కొట్లాడుతాం. మా ప్రాణం పోయినా భూమి ఇవ్వం అని మహిళలు చెబుతున్నారని కేటీఆర్ తెలిపారు.
ఇంత మంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి, భూములు గుంజుకునే కుట్ర చేస్తోంది ప్రభుత్వం. కచ్చితంగా న్యాయ పోరాటం చేసి అడ్డుకుంటాం. పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. లగచర్లలో అరెస్టు అయిన వారికి చిత్రహింసలు పెడుతున్నారు. నడవలేని, మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరుతున్నాను. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని వెంటనే విచారణ చేయండి. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణను కోరుతున్నాను. పౌర, గిరిజన, మహిళ సంఘాలు కూడా ఈ దురాగతాలపై, కితరాక చర్యలపై స్పందించాలి. రాజకీయ రంగు పులిమి ఇంత మంది గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. భూములు లాక్కొనే ప్రయత్నం చేస్తున్నది. దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ భవన్లో కేటీఆర్‌ను కలిసిన ఆరో తరగతి బాలిక
Gummadi Narsaiah | కంటి పరీక్షల కోసం.. క్యూ లైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..!
Ram Charan | కడప అమీన్ పీర్ దర్గా వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్