బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 17:38:40

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు

హైదరాబాద్‌ : తుంగభద్ర పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై అర‌ణ్య భ‌వ‌న్ లో దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్ తో పాటు ఇత‌ర అధికారులతో సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తుంగభద్ర పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2.50 కోట్ల నిధులు మంజూరు చేసింద‌ని, పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.

పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద‌న్నారు. న‌దీ ప్రవాహం ఎక్కువ‌గా ఉన్నందున‌  పుష్కర ఘాట్‌ ప్రదేశంలో జాలి(మెష్) కంచెను ఏర్పాటు చేయాల‌న్నారు. గజ ఈతగాళ్లు, బోట్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ‌కోవిడ్‍ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు నిర్వహిస్తున్నందున భ‌క్తులు కూడా స‌హక‌రించాల‌ని కోరారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పుష్కర ఘాట్ల వద్ద సంప్రదాయ పూజలు, పిండ ప్రధానాలు చేసుకోవాల‌ని భ‌క్తుల‌కు సూచించారు.