శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:45

పెదవి కదపకుండానే కొండల్ని కదిలించారు

పెదవి కదపకుండానే కొండల్ని కదిలించారు

  • ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘హాఫ్‌ లయన్‌' రచయిత వినయ్‌ సీతాపతి

మేధావి, సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, పరమ ఆధ్యాత్మికుడు.. పాములపర్తి వేంకట నరసింహారావు.. క్లుప్తంగా పీవీ.. గురించి ఎవరైనా ఈ మాటలు చెప్తారు. అద్భుతమైన రాజనీతిజ్ఞతతో ఐదేళ్లు ప్రధానిగా పరిపాలన సాగించిన అపరచాణక్యుడిగా పీవీ ప్రశంసలు అందుకున్నారు. అనూహ్యంగా అత్యున్నత పదవిని అధిష్టించి భారతదేశ చరిత్రను మలుపుతిప్పిన అపురూపమైన నేతగా కొందరు అభివర్ణిస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఇంతకూ చరిత్ర ఆయనపై ఇచ్చే తీర్పు ఏమిటి? పీవీ పాలనపై ’హాఫ్‌ లయన్‌ : హౌ పీవీ నరసింహారావు ట్రాన్స్‌ఫార్మ్‌డ్‌ ఇండియా’ అనే సాధికారికమైన పుస్తకం వెలువరించిన వినయ్‌ సీతాపతి మాటల్లో చెప్పాలంటే.. చైనాను సమూలంగా మార్చేసిన డెంగ్‌ సియావోపింగ్‌ సరసన పీవీ ఉంటారు. కమాండ్‌ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనాను బంధవిముక్తురాలిని చేసి మార్కెట్‌ సంస్కరణలు ప్రవేశపెట్టి  ఆచరణవాదంవైపు నడిపించిన దార్శనికుడిగా డెంగ్‌ మన్ననలు అందుకున్నారు. పీవీ మనదేశానికి లభించిన డెంగ్‌ అంటారు సీతాపతి. అంతేకాకుండా మైనారిటీ ప్రభుత్వ అష్టదిగ్బంధనాల మధ్య దేశాన్ని అపూర్వమైన రాజనీతిజ్ఞతతో సంక్షోభం నుంచి గట్టెక్కించిన పీవీని దేశం ఇప్పటిదాకా చూసిన ప్రధానుల్లో కెల్లా ఉత్తమ ప్రధాని అని నిగ్గుతేల్చారు అశోకా యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న వినయ్‌ సీతాపతి. ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..

మనదేశ చరిత్రలో 90వ దశకం ఏరకంగా  ప్రత్యేకమైదని మీరు భావిస్తారు?  భారతదేశ గతిని పీవీ ఎలా మలుపుతిప్పారు?

‘90వ దశకం భారతదేశానికి పెద్దమలుపు వంటిది. నరసింహారావుపై పుస్తకం రాసే బాధ్యతను పెంగ్విన్‌ నాకు అప్పగించినప్పుడు నేను 60ల నుంచి 2000 వరకు భారతదేశ స్థితిగతులను అధ్యయనం చేశాను. పరిశోధన మొదలుపెట్టేనాటికి నాకు మాజీ ప్రధాని గురించి పెద్దగా తెలియదు. సుమారు 200 పుస్తకాలు చదివాను. ఆయన సన్నిహితులను, కుటుంబ సభ్యులను కలుసుకుని మాట్లాడాను. ఇవన్నీ తరచి చూస్తే 90ల్లో భారతదేశం చూసిన పరిణామక్రమం, అందులో పీవీ నిర్వహించిన ముఖ్యపాత్ర నా కళ్లకు కట్టాయి. ఇక పుస్తకం రాయడమే తరువాయి అనిపించింది’‘90వ దశకంలో కేవలం ఆర్థిక సంస్కరణలు లేదా సరళీకరణ మాత్రమే రాలేదు. 

అప్పటికి జాతీయ స్థాయి లో సంక్షేమ రంగంలో భారీస్థాయి పథకాలు ఏవీ రాలేదు. పీవీ హయాంలోనే మధ్యాహ్న భోజన పథకం, ఉపాధిహామీ పథకం వంటి పెద్దపెద్ద సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. విదేశాంగ విధానంలోనూ పెనుమార్పులు వచ్చాయి. అమెరికా, రష్యా వంటి ఒకరంటే ఒకరకి పొసగని బద్ధశత్రువులతో ఇండియా సన్నిహిత  స్నేహసంబంధాలు పెంపొందించుకుంది. ఇక ఆర్థిక సంస్కరణల విషయానికి వస్తే లైసెన్స్‌-కోటా వ్యవస్థను, దాంతోపాటే ఎదిగిన బ్యూరో క్రాటిజానికి చెల్లుచీటీ రాయడం అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఈ బృహత్తర కార్యాన్ని నిర్వహించేందుకు ఆర్థికమంత్రిగా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను రంగంలోకి దించారు. కానీ పరిశ్రమలను తన కిందే అట్టిపెట్టుకున్నారు. ఫైళ్ల మీద ఆయన రాసిన కామెంట్స్‌ జరుగుతున్న పరిణామాలపై ఆయనకు స్పష్టత ఉన్నట్టు రుజువు చేస్తాయి. పీవీ తెచ్చిన సరళీకరణకు నూతన పారిశ్రామిక విధానం, జాతీయ టెలికం విధానం రెండు విస్పష్టమైన ఉదాహరణలుగా నిలుస్తాయి.’

‘ఆయన పదిభాషల్లో మౌనంగా ఉండగలరు అనే జోక్‌ ఆ రోజుల్లో బాగా పాపులర్‌. పైకి ఏ నిర్ణయాలు తీసుకోని మౌనిలా కనిపిస్తూనే అనేక నిర్ణయాలను ప్రభావితం చేయడమే ఆయన అపారమైన మేధాశక్తికి నిదర్శనం. ఆనాటి రాజకీయ అస్థిర పరిస్థితుల్లో నరసింహారావు సాధించింది రాజకీయ అద్భుతం తప్ప మరోటి కాదు. అదే ఆయనను భారతదేశ చరిత్రలో అత్యుత్తమ ప్రధానిగా నిలబెట్టింది.’

‘సంక్షేమ రంగానికి కొత్త ఊపును తెచ్చేందుకు ప్రత్యేకించి ఇద్దరు ఐఏఎస్‌లను ప్రధాని కార్యాలయంలో నియమించుకున్నారు. వారు ఎవరో కాదు.. నేటి టెక్‌ దిగ్గజం సత్యనాదెళ్ల తండ్రి బీఎన్‌ యుగంధర్‌, మామ కేఆర్‌ వేణుగోపాల్‌. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత వచ్చిన ప్రధానులు సంక్షేమానికి సంబంధించి పీవీ వేసిన బాటలోనే పయనించారు.’

‘అనేకమంది ఇష్టపడని లేదా సొంతపార్టీవారే దుయ్యబట్టే విధానాలను గుట్టు చప్పుడు కాకుండా వేరేవాళ్లతో ప్రతిపాదింపజేసి తాను వెనుకనుండి నడుపడంలోనే పీవీ చాణక్య నీతి దాగుంది. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టే బాధ్యతను పరిశ్రమలశాఖ సహాయమంత్రికి అప్పగించడం ఓ ఉదాహరణ. టెలికంమంత్రి సుఖరాంతో పశ్చిమబెంగాల్‌ సీఎం జ్యోతిబసుకు ఫోన్‌ చేయించడం ద్వారా మొబైల్‌ టెలికంకు శ్రీకారం చుట్టడం పీవీకే చెల్లింది. గుంభనంగా ఉంటూ.. తన ఆనవాలు కనిపించకుండా మార్పులు తేవడం ఆయన ప్రత్యేకత. నేను పుస్తకం రాసేంతవరకు చాలామందికి ఈ సంగతులు తెలియవు. అదీ ఆయన శైలి.’

సొంతపార్టీ వ్యతిరేకతను తట్టుకుంటూ అనేక వినూత్నమైన చొరవలను పీవీ ఎలా ముందుకు తీసుకువెళ్లగలిగారు?

‘ఇక్కడే ఉంది పీవీ రాజకీయ చతురత. బలహీనమైన ప్రధానిగా ముద్ర వేశారు ఆయనపై. దాన్నే ఆయన తన బలంగా మలచుకున్నారు. అనేకమంది నెహ్రూను ఉత్తమ ప్రధానిగా చూపుతారు. కానీ కాంగ్రెస్‌లో ఆయన మాటకు ఎదురులేదు. కానీ పీవీకి ఇవేవీ లేవు. పీవీకి ముందు వెనుక అస్థిర ప్రభుత్వాలు పేకమేడల్లా కుప్పకూలాయి.  అలాంటి అస్థిర పరిస్థితుల్లో పీవీ పూర్తి ఐదేళ్లూ కొనసాగడమే కాకుండా దేశంలో ఎన్నో భారీమార్పులు తెచ్చారు. ప్రపంచ చరిత్రలోనే ఇదొక సాటిలేని అద్భుతం.’

‘ఒక ప్రధానిని అంచనా వేయాలంటే ఎలాంటి పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టారు, ఎలాంటి ముద్రవేసి వెళ్లారు అనేది పరిశీలించడమే ఉత్తమమార్గం. 

ఈ కొలమానాన్ని బట్టి చూస్తే పీవీ నరసింహారావు ఉత్తమ ప్రధానిగా నిలుస్తారు. అప్పటికి ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఉంది. విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలింది. దేశం అంతా గందరగోళంగా ఉంది. ఆ పరిస్థితుల్లో పీవీ ప్రధాని అయ్యారు. ఇప్పటి ప్రధాని మోదీ తాను అనుకున్నది చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు. కానీ పీవీ పరిస్థితి అలా కాదు.’‘విదేశాంగ విధానాన్ని నిర్వహించిన తీరులో పీవీ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. రెండు విడతలు విదేశాంగమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన వెనకుంది. విషయపరిజ్ఞానంలో విదేశాంగ కార్యదర్శులతో పోటీపడేవారు. ఎన్నోసార్లు ఆయన చైనాలో మన రాయబారి అభిప్రాయాలకు భిన్నంగా ఫైల్స్‌పై నోట్స్‌ రాసేవారు. అంతటి లోతైన అవగాహన ఆయనకు ఉండేది. అనేకమంది ప్రధానులకు విదేశీ వ్యవహారాలపై పెద్దగా ఏమీ తెలియదు. కానీ పీవీ అందుకు భిన్నం. ఆయనతో సన్నిహితంగా పనిచేసినవారికి ఆయనంటే ఎంతో గౌరవం. ఆయన మామూలు రాజకీయ నాయకుడు కాదని వారు అర్థం చేసుకోవడమే అందుకు కారణం.’

సంస్కరణల రూపశిల్పిగా ఆయన్ను చూపకుండా, బాబ్రీ వంటి సమస్యల విషయంలో ఆయనపై నెపం నెట్టుతూ పీవీకి కాంగ్రెస్‌ అన్యాయం చేసిందంటారా?

‘పీవీ వ్యక్తిత్వాన్ని కాంగ్రెస్‌వారు చిత్రించే విధానం అన్యాయంగా ఉంటుందనే చెప్పాలి. అందరిలోనూ మంచి-చెడ్డ అనేది ఉంటుంది. కాంగ్రెస్‌ ఆయన తప్పుల్ని ఎత్తిచూపుతూ ఆయన విజయాలను తక్కువచేసి మాట్లాడుతుంది. బాబ్రీ విషయానికి వస్తే తప్పంతా ఆయన మీదే రుద్దుతుంది. సోనియాను పార్టీకి దూరంగా పెట్టడమే ఆయన చేసిన నేరం మరి.  సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో ఆయన హోంమంత్రి. కానీ పోలీసులతో నేరుగా ప్రధాని కార్యాలయమే వ్యవహరించింది. అంతిమంగా బాధ్యుడు రాజీవ్‌ గాంధీయే.’

మీరు పుస్తకం కోసం కలిసిన వారిలో పీవీ వంటమనిషి రాజయ్య  వెల్లడించిన విశేషాలను వివరిస్తారా?

‘పీవీకి సన్నిహితులు ఎవరో, ఎవరెవరు విందుకు వస్తారో రాజయ్యకు తెలుసు. పీవీ ఒంటరి జీవి. ఆయనకున్న కిచెన్‌ క్యాబినెట్‌ రాజయ్య ఒక్కరే. రోజువారీ ఎజెండా మొత్తం రాజయ్యకు వేళ్లమీద ఉంటుంది. పీవీకి దర్బార్లు నిర్వహించే అలవాటు లేదు. ఆయన ఆంతరంగికులే వస్తారు. మాట్లాడి వెళతారు. పీవీ నిత్యవ్యవహారాలు రాజయ్యకు కొట్టిన పిండి. పీవీతో రాజయ్య అనేక విదేశాలకు వెళ్లివచ్చారు. శ్వేతసౌధంలో బిల్‌ క్లింటన్‌ ఇచ్చే విందులో కూడా రాజయ్య వండిన వంటలే పీవీ తినేవారు. కాకరకాయ కూర అంటే ఇష్టం. మాంసాహారం, మద్యం ముట్ట రు. ఆయన నూరుపాళ్ల భారతీయుడు. పాశ్చాత్య పోకడలు ఆయనలో ఉండేవి కావు.’

తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న పీవీ శతజయంతి ఉత్సవాల గురించి..

‘తెలంగాణా నుంచి వచ్చిన అద్వితీయమైన వ్యక్తి పీవీ. అలాంటి పీవీ చరిత్రను ప్రజారంజకంగా ప్రచారం చేయడంలో శతజయంతి ఉత్సవాలు విజయం సాధిస్తాయని ఆశిస్తున్నాను. పీవీ కుటుంబం దగ్గరున్న ఆయన రచనలు, ప్రసంగాలు, పత్రాలు అన్నింటినీ డిజిటైజ్‌ చేసి ప్రజలకు వెబ్‌లో అందుబాటులో ఉంచడమే ఆయనకు గొప్ప నివాళి. పీవీ రచనలు అందరికి అందుబాటులో ఉంటే ఆయన గురించి ఎక్కువ మంది రాసేందుకు వీలుంటుంది. మహాత్మాగాంధీపై ఎక్కువ రచనలు రావడానికి ఆయన రచనలు సంపుటాల్లో అందరికీ అందుబాటులో ఉండడమే కారణం. పీవీ విషయంలోనూ అలా జరగాలి. అందుకు ఓ ప్రపంచస్థాయి వెబ్‌సైట్‌ను తయారు చేయాలి. ఆయన స్మృతి కలకాలం నిలవాలంటే పాఠ్య పుస్తకాల్లో ఆయన జీవితంపై బడిపిల్లలకు ఓ పాఠ్యాంశం ప్రవేశపెట్టాలి. పీవీ నరసింహారావు గురించి తెలుసుకుంటే తెలంగాణ చరిత్రను తెలుసుకున్నట్టే.’

‘బాబ్రీ కూల్చివేత విషయంలో అందరూ పీవీ మీదే నెపం వేస్తారు. కానీ అప్పటి హోంమంత్రి ఎస్‌బీ చవాన్‌ గురించి ఎవరూ మాట్లాడరు. రాజకీయ నాయకులకు తమ పదవులు కాపాడుకోవడం ముఖ్యం. కాకపోతే పీవీ దేశానికి ఏదైనా మేలు చేయగలమా అనే ఉద్దేశంతో ఆ పని చేసేవారు. బాబ్రీ అనేది ఓ జటిల సమస్య. ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌ సింగ్‌ నేతృత్వంలో ఎన్నికైన ప్రభుత్వం ఉంది. కూల్చివేతకు ముందు మిశ్రమ సంకేతాలు వెలువడ్డాయి. అప్పటి పరిస్థితుల్లో పీవీ కన్నా బాగా వేరొకరు వ్యవహరించి ఉండేవారని నేను అనుకోను.’


logo