మునిపల్లి, మే 06: వివిధ సర్టిఫికెట్ల కోసం మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారు ఎవరైనా సరే పైసలు తీసుకొనే ఇవ్వాలంటూ కంప్యూటర్ ఆపరేటర్లకు సంగారెడ్డి జిల్లా మునిపల్లి (Munipally) ఎంపీడీఓ హరినందన్ రావు ఆదేశించారు. తనకు లంచాలు తీసుకోవడానికి లైసెన్స్ వచ్చిందని, ప్రతి పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.15 వేలు చేస్తా.. ఎవరేం చేస్తారో చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘మునిపల్లి ఎంపీడీవో అవినీతి బాగోతం’ అనే శీర్షికన ఇటీవల నమస్తే తెలంగాణలో వార్త ప్రచురితమైంది. దీంతో రెండు రోజుల క్రితం పంచాయతీ కార్యదర్శులతో హడావిడిగా సమావేశం నిర్వహించారు. దీనికి నమస్తే తెలంగాణ మినహా పలువురు మీడియా ప్రతినిధులను కూడా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులతో దురుసుగా మాట్లాడారని తెలిసింది. తాను డబ్బులు తీసుకున్నట్లు ‘నమస్తే’ రిపోర్టర్‌కు పేమెంటుకు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఎవరు షేర్ చేశారో చెప్పాలంటూ పరుష పదజాలంతో కార్యదర్శులను తిట్టినట్లు సమాచారం. అదేవిధంగా తనపై అవినీతి భాగోవతం అంటూ వచ్చిన శీర్షికను ఉద్దేశించి ఇకపై నాకు డబ్బులు వసూళ్లు చేసేందుకు లైసెన్స్ వచ్చింది.. ఇప్పటినుంచి నేను ప్రతి పంచాయతీ కార్యదర్శి దగ్గర ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తా… నన్ను ఎవరేం చేస్తారో చూస్తా. డబ్బులు ఇవ్వకపోతే మీ అంతు చూస్తానని భయందోళనకు గురి చేశారు. ఆయనపై వార్త వచ్చిన నాటి నుంచి కార్యదర్శులను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
మీడియా ముందే..
మునిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు పలువురు రిపోర్టలకు ఫోన్లు చేసి పిలిపించుకున్న హరినందన్ రావ్.. పంచాయతీ కార్యదర్శుల ముందు వారిని కూర్చోబెట్టారు. పంచాయతీ కార్యదర్శుల వద్ద డబ్బులు వసూలు చేసేందుకు నాకు లైసెన్స్ వచ్చిందని.. ఒక్కో కార్యదర్శి వద్ద రూ.15 వేలు వసూలు చేస్తా. నన్ను ఎవ్వరు ఏం చేస్తారో చూస్తా.. అడిగినంత ఇవ్వకపోతే సంబంధిత కార్యదర్శుల అంతూ చూస్తానంటూ బెదిరించారు. ఎంపీడీఓ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముందే తమను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆయన అవినీతిపై వార్తలు వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చెస్తున్నారు. ఇప్పటికైనా మునిపల్లి ఎంపీడీఓ చర్యలు తీసుకోవాలని మండలవాసులు జిల్లా కలెక్టర్‌ను కోరుతున్నారు.
మంత్రి ఇలాకాలో అవినీతి అధికారులు అవసరమా..
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇలాకాలో ఇలాంటి అవినీతి అధికారులు అవసరమా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హరినందన్ రావు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు ఉన్నప్పటికీ, ఆయనపై చర్యలు తీసుకునేందుకు జిల్లా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థకావడం లేదని చెబుతున్నారు. మునిపల్లి ఎంపీడీఓ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారో మండల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
Munipalli | మునిపల్లి ఎంపీడీవో అవినీతి బాగోతం.. పంచాయతీల తనిఖీల పేరుతో అడ్డగోలుగా పైసా వసూల్