Mandakrishna Madiga | న్యూఢిల్లీ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని తెలిపారు. ఢిల్లీలో ఇవాళ ఉదయం మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్ షా పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ సందర్భంగా కేంద్రానికి, ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ఆయా ప్రభుత్వాలు వెంటనే రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాల్లో తక్షణమే అమలయ్యేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాలని మోదీకి విజ్ఞప్తి చేసినట్లు మందకృష్ణ తెలిపారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని ప్రతి జడ్జికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏండ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు మద్దతుగా నిలిచిన ప్రతి నాయకుడికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణను దక్షిణాదిలో నలుగురు సీఎంలు వెంటనే స్వాగతించారని, ఆయా రాష్ట్రాల్లో వెంటనే అమలు చేయాలని కోరుతున్నట్లు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిన నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మందకృష్ణ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
Zoetis Inc | హైదరాబాద్లో కేపబులిటీ సెంటర్ను విస్తరించనున్న జొయిటిస్.. వందలాది మందికి ఉద్యోగాలు
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
Karimnagar | మెట్పల్లిలో పోలీసుల అత్యుత్సాహం.. మహిళపై లాఠీ ఝులిపించారు.. వీడియో