ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో స్వావలంబన కలిగి ఉండాలని కోరుకొంటాయి. ప్రపంచంలోనే పెద్ద జనాభా ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలు, ఇబ్బందులు ఏర్పడితే అహార కొరత రాకూడదనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వచ్చింది. కనీసం రెండుమూడేండ్ల పాటు బఫర్ స్టాక్ నిర్వహించడం కేంద్రం కర్తవ్యం. కరోనాలాంటి జబ్బు వస్తదని అనుకోలేదు. ఈ మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. భవిష్యత్తులో ఏదైనా దేశంలో కరువు వస్తే వారంపాటు అన్నం పెట్టే శక్తి ప్రపంచంలో ఏ దేశానికీ లేదు. ప్రపంచంలో 10 లక్షల నుంచి 10 కోట్ల లోపు జనాభా ఉన్న దేశాలే 179 ఉన్నాయి. నూటనలభై కోట్ల జనాభా ఉన్న భారత్‌కు అన్నం పెట్టే పరిస్థితి ఏ దేశానికి లేదు.
– ముఖ్యమంత్రి కేసీఆర్, (మార్చి 21, 2022)
బియ్యం మొత్తం మీ రాష్ట్రమే కొనుగోలు చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండి.. యాసంగి వడ్ల కొనుగోలు సమస్య ఆటోమేటిక్‌గా పరిష్కారం అయిపోతుంది. దుకాణాల్లో ఏది అమ్ముడు పోతే అదే మేము కొంటాం. ధాన్యం సేకరణ విధానాన్ని మీరు అధికారంలోకి వచ్చాక మార్చుకోండి.
– పీయూష్ గోయల్, కేంద్ర ఆహార శాఖ మంత్రి (మార్చి 25, 2022)
హైదరాబాద్, సెప్టెంబర్ 9 ( నమస్తే తెలంగాణ): సరిగ్గా ఏడాది కిందట.. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం మొండికేయడంతో.. రాష్ట్ర వ్యవ సాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గతేడాది సెప్టెంబర్ 8న ఎఫ్‌సీఐ తెలం గాణ రీజియన్ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో సమావేశమయ్యారు. దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని కోరారు. దీనికి దీపక్ శర్మ ససేమిరా అన్నారు.
ఆరు నెలల కిందట.. : వడ్ల కొనుగోలుపై ఈ ఏడాది మార్చి 25న రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ను కలువడానికి వెళ్లింది. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్‌గా మార్చకపోతే నూక శాతం ఎక్కువగా వస్తుందని తెలిపింది. బాయిల్డ్ రైస్నైనా కొనాలని లేదంటే బియ్యాన్ని, నూకలను కూడా కొనాలని కోరింది. దీనికి కేంద్ర మంత్రి ‘తెలంగాణ ప్రజలతో నూకలు బుక్కించండి’ అంటూ అవమానించారు.
ఇప్పుడు.. దేశంలో బియ్యం, నూకల నిల్వలు పడిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. గురువారం నుంచి బియ్యం ఎగుమతులపై 20 శాతం పన్ను విధించగా, శుక్రవారం నుంచి నూకల ఎగుమతిని పూర్తిగా నిషేధించింది.
తెలంగాణ ప్రభుత్వంపై మోదీ ప్రభుత్వం పెంచుకున్న కక్ష.. ఇప్పుడు దేశానికి శిక్షగా మారింది. సీఎం కేసీఆర్‌ను బదనాం చేసేందుకు వరి విషయంలో బీజేపీ తీసుకొన్న అడ్డగోలు నిర్ణయాలు ఇప్పుడు దేశాన్ని ఆహార సంక్షోభంలోకి నెడుతున్నాయి. తెలంగాణ రైతులపై కేంద్రం పెంచుకున్న పగ.. దేశం మొత్తాన్ని విపత్తులోకి నెట్టింది. ఆరు నెలల కిందట నాలుగేండ్లకు సరిపడా గోధుమలు, బియ్యం నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గప్పాలు కొట్టింది. వరి వెయ్యొద్దని, బియ్యం కొనుగోలు చేయబోమని మొండికేసింది. ఇప్పటికే గోధుమ, దాని ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం.. ఇటీవలే బియ్యం ఎగుమతులను నియంత్రించింది. 20% ఎగుమతి సుంకాన్ని విధించింది. తెలంగాణ ప్రజలను నూకలు బుక్కుమని అవమానించిన బీజేపీ ఇప్పుడు నిస్సిగ్గుగా నూకల ఎగుమతిపైనా నిషేధం పెట్టింది. దేశీయంగా బియ్యం, నూకల నిల్వలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నది. దీన్ని కేంద్ర ప్రభుత్వానికి దేశ ప్రజల అవసరాలపై దీర్ఘకాలిక ప్రణాళిక కరువైందని తేలిపోయింది. కనీసం ఆరేడు నెలల స్వల్పకాలిక ప్రణాళిక లేని మందబుద్ధి కేంద్రంలోని బీజేపీ సర్కారుది.
కోటి ఎకరాల్లో నాట్లు బంద్..
కేంద్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా దేశంలో వరి సాగుపై నియంత్రణ విధిస్తున్నది. వరి వెయ్యొద్దని, ఇతర పంటలవైపు రైతులను మళ్లించాలని రాష్ర్టాలపై ఒత్తిడి తెచ్చింది. ఒక రాష్ట్రం నుంచి ఇంత బియ్యమే సేకరిస్తామంటూ షరతు విధించింది. వరి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమంటూ కొర్రీలు పెట్టింది. మొత్తంగా వరికి ఉరి వేసింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్నదాతలు అయోమయంలో పడ్డారు. గత వానకాలం సీజన్‌తో పోల్చితే ఈసారి సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఎకరాల్లో వరిసాగు తగ్గింది.ఇది కోటి ఎకరాలు దాటుతుందని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా ఈసారి సుమారు 12-15 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం నియంత్రణ చర్యలను ప్రారంభించిందని అంటున్నారు.
పడిపోతున్న ఆహార నిల్వలు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో ఇప్పటికే గోధుమలు, బియ్యం నిల్వలు తగ్గాయని అధికారులు చెప్తున్నారు. గోధుమ నిల్వలు 14 ఏండ్ల కనిష్టానికి పడిపోయినట్లు ఎఫ్‌సీఐ వర్గాలు వెల్లడించాయి. బియ్యం నిల్వలు కూడా వేగంగా పడిపోతున్నాయి. నిబంధనల ప్రకారం దేశంలో 13.6 మిలియన్ టన్నుల బఫర్ స్టాక్ ఉండాలి. కానీ.. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 11.4 మిలియన్ టన్నులకు పడిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే.. 2.2 మిలియన్ టన్నుల్లో కోత పడనున్నది. ఫలితంగా దేశంలో ఆహార భద్రత దెబ్బతినే ప్రమాదం ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం ఓవైపు ఆహారధాన్యాల ఎగుమతులపై ఆంక్షలు విధించడంతోపాటు.. మరోవైపు ఉచితరేషన్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచన చేస్తున్నట్టు కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. దానిని కొనసాగించే అవకాశం లేనట్టు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో 10% ధరలు పెరిగాయి. దీనిని బట్టే కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేదని స్పష్టమవుతున్నది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అనేక దేశాల్లో కరువు, వరదల నేపథ్యంలో అంతర్జాతీయంగా బియ్యానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇలాంటి దశలో నియంత్రణ చర్యలు విధించడం ద్వారా కేంద్రం నిర్ణయాలకు దిశ, దశ ఉండదని మరోసారి నిరూపితమైందని చెప్తున్నారు. వరి వెయ్యొద్దని చెప్పి తమ నోట్లో కేంద్రం మట్టికొట్టిందని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.