రంగారెడ్డి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో రహదారులు, ఫ్యూచర్‌సిటీ, పరిశ్రమల పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణకు తెరతీసింది. భూములు లాక్కొవద్దని వేడుకుంటున్న రైతులపై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమైంది. ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నది. ఫ్యూచర్‌సిటీ అంటూ ఏడు మండలాల్లో 30 వేల ఎకరాలు, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, రీజినల్ రింగ్‌రోడ్డు, ఫ్యూచర్‌సిటీ కట్టి, అక్కడి నుంచి అమరావతి 12 లైన్ల రోడ్డు, సర్వీసు రోడ్లు వేస్తామంటూ మరో పదివేల ఎకరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. పలు పరిశ్రమలు నెలకొల్పుతామంటూ ఐదువేల ఎకరాలను సేకరించే పనికి పచ్చజెండా ఊపింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు, యాచారం, తలకొండపల్లి, మాడ్గుల, కొందుర్గు, ఫారుక్‌నగర్, కేశంపేట మండలాల పరిధిలో భూసేకరణ ప్రక్రియ యథేచ్ఛగా సాగుతున్నది. అధికారులు ఎప్పుడు ఎక్కడ హద్దురాళ్లు పాతుతారోనని రైతులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో గ్రీన్‌పీల్డ్ రోడ్డు పేరిట వెయ్యి ఎకరాల భూసేకరణ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. భూసేకరణను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అధికారులు పోలీసు బలగాలతో రంగంలోకి దిగి, చాలా చోట్ల హద్దురాళ్లు ఏర్పాటు చేశారు. భూమికి భూమి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం అడ్డగోలు భూసేకరణ పేరుతో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ వైఖరితో కంటిమీద కునుకు ఉండటంలేదని వాపోతున్నారు. భూములను నమ్ముకుని జీవిస్తున్నామని చెప్తున్నారు. భూములను లాక్కుని తమను రోడ్డుపాలు చేయొద్దని కోరుతున్నారు. భూముల నుంచి తమను దూరం చేస్తే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఆందోళనకు దిగితే కేసులతో వేధించడం దారుణమని చెప్తున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో పరిశ్రమల పేరుతో ఐదువేల ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాచారం మండలంలోని మొండిగౌరెల్లిలో 680ఎకరాలు, కందుకూరు మండలంలోని తిమ్మాయపల్లి, అలాగే, తిమ్మాపూర్‌తోపాటు మరికొన్ని గ్రామాల్లో కూడా పరిశ్రమల అవసరాల పేరుతో భూసేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. మొండిగౌరెల్లిలో భూసేకరణ ప్రారంభించింది. దీంతో జిల్లాలో ఇప్పటికే సగం వరకు భూములను భూసేకరణ పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి దూరంచేసే కార్యక్రమానికి సిద్ధపడింది.