సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కమీషన్ల దందా వేళ్లూనుకుపోయింది..కేవలం ‘ముఖ్య’నేత వర్సెస్ మంత్రులే కాదు! చివరకు షాడోలు వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య కూడా ఈ వాటాల దందా చిచ్చు రేపుతున్నది. నిన్నటికి నిన్న ‘ముఖ్య’నేతపై ఓ మంత్రి కుమార్తె చేసిన తీవ్రస్థాయి ఆరోపణలు పంపకాల ప్రక్రియను వీధికెక్కించిన విషయం తెలిసిందే.
తాజాగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి పనుల్లోనూ కాంగ్రెస్ నేతల మధ్య కమీషన్ల దందా సెగలు పుట్టిస్తున్న వైనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల్లో వాటాల పంపకం పురపాలక శాఖలో షాడో సీఎంగా వ్యవహరించే ‘ముఖ్య’నేత సన్నిహితుడు, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి మధ్య పెద్ద ఎత్తున రచ్చకు దారి తీసినట్లు సమాచారం. ఈ పరిణామంతోనే టెండర్లు పూర్తయినప్పటికీ పనులు మొదలుపెట్టేందుకు కాంట్రాక్టరు జంకుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
నగరంలోని కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనులకు గతంలోనే హెచ్ఎండీఏ ప్రతిపాదనలు రూపొందించింది. సుమారు రూ.9.90 కోట్ల అంచనా విలువతో కొంతకాలం కిందట ఈ చెరువు సుందరీకరణ పనులకు టెండర్లు పిలవగా… ఓ కంపెనీ పనులను దక్కించుకుంది. అయితే ఈ టెండర్ల ఖరారు వెనక భారీ మతలబు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఆ పనులను దక్కించుకునేందుకు సదరు కంపెనీ ముందుగానే ‘ముఖ్య’నేత సన్నిహితుడిని కలిసినట్లు తెలిసింది. ‘ముఖ్య’నేతకు చెందిన పోర్టుపోలియోల్లో ప్రధానంగా నలుగురు సన్నిహితులు షాడో సీఎంగా వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
అందులో భాగంగా పురపాలక శాఖ… అందునా హెచ్ఎండీఏ కార్యకలాపాలు సదరు ‘ముఖ్య’నేత సన్నిహితుడి కనుసన్నల్లోనే సాగుతాయనేది అందరికీ తెలిసిన వాస్తవమే. ‘ఉదయ’ం లేచింది మొదలు ఆయన పురపాలక శాఖ పరిధిలోని పలు విభాగాల్లో బదిలీల నుంచి అభివృద్ధి పనుల టెండర్లు, బహుళ అంతస్తులు, లేఅవుట్ల అనుమతులు, భూ వినియోగ మార్పిడి వంటి దస్ర్తాల్లోనే నిమగ్నమై ఉంటారనేది అధికారికవర్గాల్లో చర్చనీయాంశం. అయితే తిరుమలగిరి చెరువు సుందరీకరణ టెండర్ల విషయమై సదరు కాంట్రాక్టరు కలిసి భారీ మొత్తాన్ని ముట్టజెప్పినట్లు తెలుస్తున్నది. ఇందుకు అనుగుణంగా ఆ కంపెనీకి పనులు దక్కాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా అధికారులు వర్క్ ఆర్డర్ ఇవ్వగానే పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే అసలు కథ మొదలైంది.
తిరుమలగిరి చెరువు సుందరీకరణ పనుల టెండర్లు పూర్తయిన విషయం స్థానిక ప్రజాప్రతినిధి చెవిన పడటంతో ఆయన అధికారులపై గరం గరం అయినట్లు తెలిసింది. తన పరిధిలో, తనకు తెల్వకుండా టెండర్లు ఎలా ఖరారు చేస్తారని సదరు ప్రజాప్రతినిధి ప్రశ్నించడంతో అధికారులు తెర వెనుక జరిగిన తంతుపై కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. దీంతో ఆగ్రహోదగ్రుడైన ప్రజాప్రతినిధి నేరుగా షాడో సీఎంకే ఫోన్ చేసినట్లు చెబుతున్నారు.
నా పరిధిలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. కాంట్రాక్టరుతో మీరు మాట్లాడుకుంటే తన సంగతి ఎవరు తేల్చాలని నిలదీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని ‘ముఖ్య’నేత దృష్టికి తీసుకుపోతానని కూడా హెచ్చరించినట్లు చెబుతున్నారు. కాగా ప్రజాప్రతినిధి ఇదే ఆగ్రహాన్ని కాంట్రాక్టరుపైనా ప్రదర్శించినట్లు తెలిసింది. అక్కడ సమర్పించుకోవడం కాదు… తన సంగతి కూడా తేల్చాలని స్పష్టం చేయడంతో రెండోసారి సమర్పించుకుంటే తనకు మిగిలేది ఏందం టూ కాంట్రాక్టరు తల పట్టుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో పనులు మొదలుపెట్టేందుకు తటపటాయిస్తున్నట్లు సమాచారం.