సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం బలోపేతం చేసిన ఆరోగ్య కేంద్రాలు నేడు అనారోగ్యంగా మారాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య కేంద్రాల్లో జలుబు, దగ్గు, విటమిన్ వంటి కనీస మందులు కూడా అందలేని దుస్థితి నెలకొందని రోగులు ఆరోపిస్తున్నారు. నగర వాసులకు మెరుగైన చికిత్స అందించే లక్ష్యంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం ప్రతి 10వేల మందికి ఒక బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో 2018లో 40 కేంద్రాలతో ప్రారంభించి, దశల వారీగా గ్రేటర్ వ్యాప్తంగా 292 బస్తీదవాఖానలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ బస్తీ దవాఖానల్లో ప్రాథమిక వైద్యంతో పాటు 55రకాల రోగ నిర్ధారణ పరీక్షలు, 125 రకాల మందుల పంపిణీ, ముఖ్యంగా సీజనల్ వ్యాధులు వంటి వాటికి ప్రారంభ దశలోనే చెక్ పెడుతూ వ్యాధులను బస్తీ గడప దాటనీయకుండా కట్టడి చేసేవిధంగా నాటి బీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకున్నది. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా దవాఖానలు, జిల్లా దవాఖానలు, ఉస్మానియా, గాంధీ వంటి టెర్షరీ దవాఖానలు ఇలా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యపరీక్షలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు అన్ని రకాల మందులను కచ్చితంగా ఇవ్వాలనే నిబంధనలు సైతం పెట్టింది.
అరకొర మందులు. అందులో వైద్యులు మూడు లేదా ఐదు రోజులకు మందులు రాస్తే అందులో సగం మాత్రమే ఇస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. మూడు రోజులకు రాస్తే రెండు రోజులకు, ఐదు రోజులకు రాస్తే మూడు రోజులకే ఇస్తున్నట్లు వాపోతున్నారు. దీంతో సగం మందులను బయట నుంచే కొనుగోలు చేయాల్సి వస్తోందంటున్నారు రోగులు. బీఆర్ఎస్ హయాంలో అయితే బస్తీ దవాఖానల్లోనే 125రకాల మందులు ఇచ్చేవారని, కాని ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని, కొన్ని బస్తీ దవాఖానల్లో వైద్యులు కూడా లేకపోవడంతో నర్సులే మందులు ఇచ్చి పంపుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సరైన నిర్వహణ లేకపోవడంతో మళ్లీ ప్రైవేటు బాట పట్టాల్సి వస్తోందని దీని వల్ల నిరుపేద రోగులకు మళ్లీ ఆర్థిక భారం తప్పడం లేదని రోగులు వాపోతున్నారు.
బస్తీ దవాఖానలతో పాటు పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు తదితర అన్ని ఆరోగ్య కేంద్రాల్లో 125 రకాల మందులను నాటి బీఆర్ఎస్ సర్కార్ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో జ్వరం, జలుబు, దగ్గు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి మందులను ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవడమే కాకుండా ఉస్మానియా, గాంధీ లేదా ప్రైవేటు దవాఖానల బాట పట్టాల్సి వస్తోందని రోగులు ఆరోపిస్తున్నారు. బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో వైద్యులు రాసిన మందుల్లో కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు రోగులు చెబుతున్నారు.