హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బోర్డు నిర్వహణకు నిధులు లేవని, నిధులు కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రభుత్వాలను కోరింది. లేకపోతే టెలిమెట్రీల ఏర్పాటు కోసం కేటాయించిన నిధులను వాడుకుంటామని తెలిపింది. బోర్డు నిర్వహణకు నిధులను విడుదల చేస్తే.. అప్పుడు టెలిమెట్రీల కోసం మళ్లీ సర్దుబాటు చేస్తామని పేర్కొన్నది. ఈ మేరకు రెండు రాష్ర్టాల ప్రభుత్వాలకు మరోసారి లేఖరాసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేఆర్ఎంబీ నిర్వహణకు అవసరయ్యే నిధులను ఇరురాష్ట్రాలు చెరిసగం భరించాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.24 కోట్లు అవసరమన్న బోర్డు ప్రతిపాదనలకు జనవరిలో రెండు రాష్ర్టాలు ఆమోదం తెలపగా, రూ.12 కోట్ల చొప్పున విడుదల చేయాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
దీంతో బోర్డు కార్పస్‌ఫండ్ నుంచి జీతాల చెల్లింపు, తదితర ఖర్చులకు వినియోగిస్తున్నది. ప్రస్తుతం ఆ నిధులు కూడా ఖాళీ అయ్యాయని తెలిసింది. ఈ నేపథ్యంలో టెలీమెట్రీల కోసం కేటాయించిన బడ్జెట్‌ను వినియోగించుకుంటామని బోర్డు మరోసారి లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగం, నీటి విడుదల లెక్కలను పక్కాగా సేకరించేందుకు టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని గతంలోనే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అంగీకారానికి వచ్చాయి. అధికారులు మొదటి విడతలో 18 చోట్ల టెలిమెట్రీలను ఏర్పాటు చేశారు. ఫేజ్ 2 కింద 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ఇందుకు రూ.7.18 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ ప్రభుత్వం టెలీమెట్రీల కోసం రూ.4.18 కోట్లను విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. దీంతో ఫేజ్ 2 టెలీమెట్రీల ప్రక్రియ మొదలుకాలేదు. ఏపీ కూడా నిధులు ఇస్తేనే టెలీమెట్రీలు ఏర్పాటు చేస్తామని బోర్డు చెప్తున్నది. కానీ టెలీమెట్రీల కోసం ఉన్న నిధులను కూడా నిర్వహణకు వాడుకుంటే.. ఇక ఏపీ జలదోపిడీని అడ్డుకోవడం ఎలా అని నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. సీడబ్ల్యూసీ డిజైన్స్, పరిశోధన విభాగం ఎక్స్ అఫిషియో సభ్యుడు ఆదిత్యశర్మ, సీడబ్ల్యూసీ సీఈ ఎస్ఎస్ భక్షి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) మెంబర్ సెక్రటరీ ఎం రఘురాంల బృందం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా పనుల వివరాలను ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నరసింహమూర్తి, ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మోడల్ డ్యామ్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వగా, స్పిల్‌వే, గేట్లు తదితర వాటి పనితీరుపై ఆరా తీశారు. ప్రాజెక్టు అప్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్, గ్యాప్1, డయాఫ్రమ్ వాల్, జలవిద్యుత్ కేంద్రం పనుల పురోగతిని సీడబ్ల్యూసీ ప్రతినిధులు అడిగి తెలుసుకున్నారు.