హైదరాబాద్, నమస్తే తెలంగాణ 21 (నమస్తే తెలంగాణ) : యాంటీబయాటిక్స్ను విచ్చలవిడిగా వాడితే పెను ముప్పు తప్పదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) తన తాజా అధ్యయనంలో హెచ్చరించింది. దేశంలో ప్రతి 10 మందిలో ఎనిమిది మంది యాంటీబయాటిక్ రెసిస్టెంట్ (ఏఎంఆర్) బ్యాక్టీరియాతో బాధ పడుతున్నారని తెలిపింది. దేశంలో 83 శాతం మందిలో మందులకు లొంగని బ్యాక్టీరియాను గుర్తించినట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్ను డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకున్నా.. విచ్చలవిడిగా వాడటంతోపాటు ఆహార ఉత్పత్తుల్లో సైతం యథేచ్ఛగా వినియోగించడంతో మన శరీరంలో మందులకు లొంగని బాక్టీరియా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐజీ అధ్యయనాన్ని ‘లాన్సెట్ ఈ క్లినికల్ మెడిసిన్ జర్నల్’ తాజాగా ప్రచురించింది.
భారత్, ఇటలీ, అమెరికా, నెదర్లాండ్స్లో 1200 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. మన దేశంలో 300 మంది నుంచి నమునాలు సేకరించారు. ఇందులో 18-80 ఏండ్ల మధ్య వయసున్న వారు పాల్గొన్నారు. వీరిలో 83 శాతం మందిలో మందులకు లొంగని బ్యాక్టీరియా (మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఆర్గనిజమ్స్)ను గుర్తించారు. ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ మంది ఈ బ్యాక్టీరియా బారిన పడినట్టు అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్ వాడినా.. కొన్ని బ్యాక్టీరియాలు లొంగడం లేదని తెలిపింది. ఈ పరిణామాలతో చికిత్స కఠినతరం అవుతుందని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని హెచ్చరించింది. చికిత్సకు ఖర్చు భారీగా పెరుగుతుందని స్పష్టం చేసింది. ఇటలీలో 31.5శాతం, అమెరికా 20.1శాతం, నెదర్లాండ్స్ 10శాతం మంది మొండి బ్యాక్టీరియా బారిన పడినట్టు అధ్యయనం వెల్లడించింది.
మన దేశంలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయాటిక్స్ పూర్తయ్యే వరకు వాడకుండా మధ్యలోనే ఆపేయడం, స్వీయ చికిత్స ఈ పరిస్థితికి కారణమని, అందుకే మొండి బ్యాక్టీరియాలు మందులకు లొంగడం లేదని తెలిపింది. ఈ పరిణామాలను ప్రజారోగ్య అత్యయిక పరిస్థితిగా పేర్కొంది. మన దేశంలో ఏటా 58 వేల మంది నవ జాత శిశువుల మరణాలకు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ కారణమని స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, రొయ్యలు, చేపలు, డెయిరీ ఫాంలలో యాంటీబయాటిక్స్ను వినియోగిస్తున్నారని, ఆ ఆహారం వినియోగంతో మానవ శరీరంలోకి సూపర్ బగ్ చేరుతున్నట్టు తెలిపింది.
మందులకు లొంగని బ్యాక్టీరియాల ముప్పును అధిగమించేందుకు ఏఐజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి ఆరు సూత్రాలను సూచించారు. 1) డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దు. 2) వైరల్ జబ్బులకు యాంటీబయాటిక్స్ రాయాలని వైద్యులను డిమాండ్ చేయొద్దు. 3) వైద్యులు యాంటిబయాటిక్స్ సూచిస్తే మొత్తం కోర్సు పూర్తయ్యే వరకు మందులు వేసుకోవాలి. కోర్సు మధ్యలో ఆపితే బ్యాక్టీరియా మరింత శక్తిమంతంగా మారుతుంది. 4) హైజీన్గా ఉండటంలో భాగంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. నాణ్యమైన ఆహార పదార్థాలు తినాలి. ప్రజల్లో తిరిగి వచ్చిన తర్వాత శానిటైజేషన్ చేసుకోవాలి. 5) అవసరమైన వ్యాక్సిన్లు వేయించుకోవాలి. 6) వెటర్నరీ వైద్యుల సూచనలతోనే పెంపుడు జంతువులకు యాంటిబయాటిక్స్ వాడాలి.
