గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 17, 2020 , 02:05:52

విపక్షాలది దరిద్ర రాజకీయం

విపక్షాలది దరిద్ర రాజకీయం

  • మండిపడిన మంత్రి తలసాని  శ్రీనివాస్‌యాదవ్‌ 
  • హైకోర్టు జోక్యం చేసుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి
  • ఉస్మానియా దవాఖాన పరిశీలన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/ సుల్తాన్‌బజార్‌: దరిద్రపు రాజకీయాలతో ప్రతిపక్షాలు అడుగడుగునా ప్రగతిని అడ్డుకోవడానికి కుయుక్తులు పన్నుతున్నాయని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. ప్రజారోగ్యంపై కూడా నీచ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఉస్మానియా దవాఖాన దుస్థితికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. గురువారం ఉస్మానియా దవాఖానను తలసాని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేండ్ల కిందటే ఉస్మానియా దవాఖానను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ముందుకొస్తే హెరిటేజ్‌ భవనం పేరుతో ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని గుర్తుచేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా దవాఖానను సందర్శించి శిథిలావస్థలో ఉన్న ప్రస్తుత భవనాన్ని తొలగించి.. ఇదేస్థానంలో రెండు టవర్లతో ఆధునిక హంగులతో భవనాలు నిర్మిస్తామని ప్రకటించారని తెలిపారు. కానీ నాడు అడ్డుపడిన నాయకులు నేడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసినా, ప్రాజెక్టులు చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కొత్త సచివాలయం నిర్మిస్తామంటే అదేదో గుప్తనిధుల కోసం కూల్చుతున్నారని ఆరోపిస్తారని, దొంగ బుద్ధులునోళ్లు వక్రంగానే ఆలోచిస్తారని విమర్శించారు. 

భవనాలు కూలితే బాధ్యులు ఎవరు?

తెలంగాణలో ఉన్న దరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి తలసాని మండిపడ్డారు. బీజేపీ నాయకులు హైదరాబాద్‌ గల్లీలో ఒక డ్రామా, ఢిల్లీలో మరో డ్రామా ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఉస్మానియాను పునర్‌నిర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని తప్పుబట్టారు. హెరిటేజ్‌ భవనం అయితే దవాఖానను బాగు చేయకూడదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి కోర్టులపై, చట్టాలపై నమ్మకం ఉన్నదని తెలిపారు. దవాఖాన భవనాలు కూలితే బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని.. ఉస్మానియా దవాఖాన కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని ఒక పరిష్కారం చూపాలని ఆయన విజ్ఞప్తిచేశారు. చరిత్రలో మొదటిసారి ఉస్మానియా దవాఖానలోకి నీరు వచ్చిందని, దీనికి అనేక సాంకేతిక కారణాలున్నాయని తలసాని తెలిపారు. ఆయన వెంట ఇం చార్జి సూపరింటెండెంట్‌ పాండునాయక్‌, జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య తదితరులు ఉన్నారు.


logo