ఆర్టీసీని అమ్మేస్తే రూ.వెయ్యికోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా పేద వర్గాలకు ప్రజారవాణా వ్యవస్థ ఉండి తీరాల్సిందేనని భావించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీని నిలబెట్టారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేస్తుంటే, తెలంగాణలో మాత్రం 43 వేల ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నారు.
-నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో రవాణా మంత్రి పువ్వాడ
RTC | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలోని విపక్షాలకు మైండ్ బ్లాంక్ అవుతున్నదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆర్టీసీని అమ్మేస్తే రూ.వెయ్యికోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినా పేద వర్గాలకు ప్రజారవాణా వ్యవస్థ ఉండి తీరాల్సిందేనని భవించిన సీఎం కేసీఆర్, ఆర్టీసీని నిలబెట్టారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తుంటే, తెలంగాణలో మాత్రం 43 వేల ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే చరిత్రాత్మక నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు. ప్రధాని మోదీ ప్రజావ్యతిరేక పాలన, దేశాభ్యున్నతికి ఎంతమాత్రం తోడ్పాటు ఇవ్వని విధానాల మూలంగా 20 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని రద్దు చేసుకొని విదేశాలకు వెళ్లిపోయారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఆ పార్టీయే శత్రవని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఎవరెన్ని చేసినా రాష్ట్రంలో మూడోసారి ఏర్పడేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. ఆర్టీసీ విలీన అనంతర పరిణామాలు.. రాష్ట్రంలో, దేశంలో రాజకీయ పరిస్థితులపై ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
విభజన చట్టం పంపకాలు పూర్తి కాకుండానే బిల్లుకు ప్రయోజనం ఉండదని వాదిస్తున్నవారికి మీరు ఇచ్చే సమాధానం?
రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఆర్టీసీ ఉన్నది. దీంతోపాటు 10వ షెడ్యూల్లోని అంశాలపై వివాదాలను కేంద్రం చొరవ తీసుకొని పరిష్కరించాలి. కేంద్రం వైఫల్యం వల్లనే ఇంకా విభజన పూర్తిగా సాధ్యంకాలేదు. ఇంకా విభజన పూర్తి కాలేదు కనుక కార్పొరేషన్‌ను అలాగే ఉంచుతున్నాం. ఒరిజినల్ ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రం వాటా 38 శాతం ఉన్నది. ఆ వాటాలు విభజన ప్రక్రియలు పూర్తయ్యేదాకా కొనసాగుతాయి. ఈక్విటీలు, సంస్థ అప్పులు, ఆస్తులు, ఉద్యోగులు అన్నీ అలాగే కొనసాగుతాయి. కనుక పునర్విభజన చట్టం ఆర్టీసీ విలీనానికి అడ్డంకి ఎంతమాత్రం కాదు. ఉద్యోగులను విలీనం చేసుకోవటానికి ఏ పేచీలేదు.
ఆర్టీసీకి ఉన్న వేల కోట్ల ఆస్తుల కోసమే విలీనం చేశారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం?
అది పిచ్చి వాదన. ఆర్టీసీ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. కార్పొరేషన్‌కు ఉన్న ఆస్తులు, అప్పులు అలాగే ఉంటాయి. ఆర్టీసీ ఉన్నది ఉన్నట్టుగా విలీనం అయ్యే ఆస్కారమే లేదు. ఈ విషయం తెలియక కొంతమంది పిచ్చోళ్ల లెక్క కార్పొరేషన్ ఆస్తుల మీద కన్నేశారని వాదిస్తున్నారు. అది ముమ్మాటికీ తప్పు.
ఉద్యోగుల విలీనం ద్వారా భవిష్యత్తులో ప్రజారవాణా బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొనే ఎత్తుగడ ఉందన్న వారికి మీ సమాధానం?
ఇతర రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ప్రజారవాణా వ్యవస్థ అనే బరువును ఎప్పుడో దింపేసుకొన్నాయి. కానీ, ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉంటే పేదలకు మేలు జరుగుతుందన్న నమ్మకంతో ఆర్టీసీని బతికించాలని కేసీఆర్ చూస్తున్నారు. వేల కోట్ల నష్టం వచ్చినా ప్రజారవాణా ఉండాలనే ఉద్దేశంతోనే కొనసాగిస్తున్నాం. మిగతా రాష్ర్టాల్లోలా బాధ్యత నుంచి తెలంగాణ తప్పుకోవటం లేదు. తప్పుకోదు.
ఆర్టీసీ బిల్లుపై ఉత్కంఠకు కారణం ఏమిటి?
గవర్నర్ ప్రవర్తన అందరికీ తెలుసు. బిల్లును ఆమె పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం ఏమిటి? ఆర్టీసీ బిల్లు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నది. అందుకే దానికి గవర్నర్ అనుమతి అవసరం. చివరికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల గవర్నర్‌కు వచ్చిన ప్రయోజనం ఏమిటి? దీని వెనుక మతలబు ఏమిటి? బిల్లు పెడ్తామని సీఎం కేసీఆర్ ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. బిల్లును అటు అసెంబ్లీలో, శాసనమండలిలో ఆమోదింపజేసి గవర్నర్‌కు పంపించారు.
ఇతర బిల్లుల్లాగే ఆర్టీసీ బిల్లును గవర్నర్ పెండింగ్‌లో పెడ్తారా? ఆమోదిస్తారా? అని ఆర్టీసీ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అట్లా జరిగే అవకాశం ఉన్నదా?
బిల్లుపై ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు. కారణం ఇది ద్రవ్య బిల్లు. గవర్నర్ ఆమోదంతోనే సభలో ప్రవేశపెట్టాం. ఆమోదించాం. కనుక ఇతర బిల్లుల మాదిరిగా ఈ బిల్లును పెండింగ్‌లో పెట్టేందుకు ఆస్కారం ఉండదు.
రవాణా మంత్రిగా ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టే అవకాశం మీకు వచ్చింది. మీ ఫీలింగ్?
అది అవకాశం కాదు.. అదృష్టం. సెప్టెంబర్ 8కి నాలుగేండ్లు మంత్రిగా నా ప్రయాణం పూర్తి అవుతుంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుపతికి పోయి దైవదర్శనం చేసుకొని, మా నియోజకవర్గానికి పోయి తిరిగి బస్‌భవన్‌కు వచ్చిన. రాగానే యూనియన్ నాయకులు శాలువా కప్పి, బొకే ఇస్తూనే సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. అంతమంచి హెచ్చరిక తోఫా ఎవరూ ఆశించరు. కానీ నాకు ఎదురైంది. చరిత్రలో కేసీఆర్ మంత్రివర్గంలో మంత్రి అజయ్ అనే వ్యక్తి ఆర్టీసీని విలీనం చేశారట అని చెప్పుకుంటరు. చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉన్నది. ఇంత గొప్ప అదృష్టం కల్పించిన సీఎం కేసీఆర్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోపాటు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్కు ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ ఉనికే లేదు. బీజేపీకి ఏ నియోజకవర్గంలో కూడా డిపాజిట్ రాదు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ మాకు ప్రత్యర్థులుగా ఉండొచ్చు. సీఎం కేసీఆర్ అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు. ఇప్పుడు కూడా కచ్చితంగా 95 నుంచి 100 సీట్లు గెలుస్తాం. ముచ్చటగా మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ సమాజానికి కేసీఆరే శ్రీరామ రక్ష. తెలంగాణ సగటు పౌరుడిగా ఈ మాట చెప్తున్న. కేసీఆర్ చేతుల్లో ఉంటేనే తెలంగాణ సమాజం బాగుపడ్తది. సంతోషంగా ఉంటది. ఇంకెవరి చేతుల్లోకి వెళ్లినా కుక్కలు చించిన విస్తరే అవుతుంది.
కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థుల సంఖ్య ఎక్కువ ఉన్నట్టున్నది. దీనిపై మీ కామెంట్?
కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీఎం అభ్యర్థులున్నారు. ఆ పార్టీలో నలుగురు ఎమ్మెల్యేలుంటే ఐదుగురు సీఎం అభ్యర్థులుంటారు. అదే కాంగ్రెస్ పార్టీ రుగ్మత. కాంగ్రెస్‌కు ప్రజలకేం చేయాలనే ఆలోచన లేదు. అధికారంలోకి రావడం అన్న యావ మాత్రమే ఆ పార్టీలో కనిపిస్తున్నది. ‘కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్సే శత్రువు’ అని రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే చెప్పిండు.
శతాబ్దం వయస్సున్న ఆర్టీసీని దాదాపు పదేండ్ల వయసున్న తెలంగాణ సర్కార్‌లో విలీనం చేయటాన్ని మీరెలా చూస్తారు?
నిజాం జమానాలో అంటే 1932లో ప్రజారవాణా వ్యవస్థకు నాంది పలికినా, ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ 1958లో ప్రారంభమైంది. అంటే దాదాపు ఆరున్నర దశాబ్దాల ప్రయాణం, మొత్తంగా దాదాపు శతాబ్దికాలం. 2014లో తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత టీఎస్ ఆర్టీసీ ఏర్పడింది. ఒక సుదీర్ఘ ప్రస్థానం నుంచి 43 వేల మంది ఆర్టీసి సిబ్బందిని సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో విలీనం చేయటం గొప్ప విషయం. చట్ట ప్రకారం కార్పొరేషన్ ఉద్యోగులను నేరుగా ప్రభుత్వంలో విలీనం చేయటం సాధ్యంకాదు. ఈ సమస్యను అధిగమించటానికే ప్రత్యేకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకున్నాం. ఏపీ, మనం మినహా ఏ సర్కారు ప్రభుత్వరంగ సంస్థ ఉద్యోగులను విలీనం చేసుకోలేదు.
విలీన అంశాన్ని ఎన్నికల స్టంట్‌గా పేర్కొనేవాళ్లకు మీ సమాధానం?
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేం చేసే ఏ కార్యక్రమాన్ని అయినా స్టంట్‌గానే చూస్తారు. నాలుగేండ్ల నుంచి సీఎం కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె అనంతరం రెండేండ్లు రూ.వెయ్యి కోట్లు, రూ.1500 కోట్లు చొప్పున బడ్జెట్లో ఇచ్చారు. ఇన్ని చేసినా డీజిల్ ధరలు అసాధారణంగా పెరగడంతో రోజూ రూ. 2.5 కోట్ల నష్టం వస్తున్నది. కరోనా సమయంలో సంస్థ రోజుకు 10 కోట్ల ఆదాయం కోల్పోయింది. కరోనాలోనే 1,800 కోట్ల ఆదాయం ఆర్టీసీ నష్టపోయింది. కరోనాకన్నా ముందు 71 లక్షలు ఉన్న వ్యక్తిగత వాహనాలు, నేడు కోటి 52 లక్షలకు పెరిగాయి. ఇందులో కోటి 11 లక్షల టూ వీలర్స్ రోడ్లమీదకు వచ్చాయి. సిబ్బంది జీతభత్యాల భారం మరో రూ.180 కోట్లు. ఇట్లాంటి అనేకానేక కారణాల వల్ల ఆర్టీసీ తన కాళ్ల మీద తాను నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. నాలుగేండ్ల క్రితం ప్రభుత్వం కొంత చేయూతనిస్తే గాడిన పడుతుందని అనుకున్నాం. కానీ, అలా కుదరటం లేదు కాబట్టి ఇప్పుడు ఉద్యోగులను విలీనం చేశాం. విషయం పట్ల కనీస అవగాహన లేకుండా ఏదిపడితే అది మాట్లాడితే ఎలా?