హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అవసరాల కోసమే పోలవరం ప్రాజెక్టును (Polavaram Project) విస్తరిస్తున్నామని, వరద జలాలను వినియోగించుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) స్పష్టం చేసింది. ఆ మేరకు పాత వాదనలనే మరోసారి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA)కి వినిపించింది. ట్రిబ్యునల్, టీఏసీ అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న పనులను సమర్థించుకుంది. హైదరాబాద్‌లోని కృష్ణా-గోదావరి భవన్‌లోని కార్యాలయంలో శుక్రవారం పీపీఏ 17వ సమావేశం జరిగింది. పీపీఏ సీఈవో, సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్‌జైన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ముంపు, రాష్ర్టాల అభ్యంతరాలు, కార్యాలయ తరలింపు వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మాట్లాడుతూ.. టీఏసీకి విరుద్ధంగా ఏపీ పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నదని అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎగువ రాష్ట్రాలు కూడా ఇలాగే ప్రాజెక్టులను కడితే దిగువ రాష్ట్రాలకు చుక నీరు రాదని, ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు విస్తరణను, బనకచర్ల లింక్ పనులను చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కోరారు. పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణలో తలెత్తే ముంపుపై జాయింట్ సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను ఏపీ మరోసారి వ్యతిరేకించింది. రాష్ట్ర భవిష్యత్ అవసరాల కోసమే పోలవరం ప్రాజెక్టును విస్తరిస్తున్నామని, అయినప్పటికీ వరద జలాలనే వాడుకుంటామని ఏపీ మరోసారి వాదించింది.
సాంకేతిక అంశాలతో మాకు సంబంధం లేదు..
అనంతరం పీపీఏ సీఈవో అతుల్ జైన్ మాట్లాడుతూ.. తెలంగాణ అభ్యంతరాలతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా బదులిచ్చారు. కేంద్ర గెజిట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మెయింటెనెన్స్ మాత్రమే తాము చూస్తామని, ఫేజ్-1 పనులను డిసెంబర్ 2027 నాటికి పూర్తిచేస్తామని తెలిపారు. ప్రాజెక్టు సాంకేతిక అంశాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేశారు. ముంపును తేల్చేందుకు ఏపీ, తెలంగాణ, పీపీఏ అధికారులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ సమర్పించే నివేదికను పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సమావేశానికి తెలంగాణ ఈఎన్సీ జనరల్ అమ్జాద్ హుస్సేన్, ఇంటర్‌స్టేట్ వాటర్ రిసోర్సెస్ సీఈ ప్రసాద్, అధికారులు విజయ్ కుమార్, సుబ్రమణ్య ప్రసాద్‌తోపాటు ఏపీ ఈఎన్సీ, ఆర్అండ్ఆర్ కమిషనర్ హాజరయ్యారు. కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు.