హనుమకొండ చౌరస్తా, నవంబర్ 7: వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఉన్న రూ.88 లక్షల ప్యాకేజీని అధిగమించి అత్యధికంగా రూ.1.27 కోట్లు దేశీయ ప్యాకేజీ ఆఫర్ లభించింది. ప్లేస్మెంట్ సీజన్ 2025-26 ప్రారంభ దశలోనే మంచి ఆఫర్లు వచ్చాయి. నిట్ చరిత్రలో అత్యధిక దేశీయ ఆఫర్ రూ.1.27 కోట్ల జాబ్ ఆఫర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన బీటెక్ విద్యార్థి నారాయణ త్యాగి బహుళజాతి కంపెనీ నుంచి రూ.1.27 కోట్ల సీటీసీతో దేశీయ ఆఫర్ను పొందారు. ఇది వరంగల్ నిట్ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ప్యాకేజీ. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థి మహ్మద్ నహిల్ నష్వాన్ రూ.కోటి సీటీసీతో దేశీయ ఆఫర్ పొందారు.
అగ్రి వర్సిటీలో రూరల్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీ
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ(పీజేటీయూ)రూరల్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీకి నవంబర్ 21న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నది. జగిత్యాల, తాండూరు ప్రాంతాల్లో భర్తీ చేసే ఈ పోస్టులకు 30 సంవత్సరాలలోపు వయస్సు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్ లేదా అనుబంధ సైన్స్ గ్రూపుల్లో బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా నిర్ణయించింది. వివరాలకు www.pjtau.edu.in వెబ్సైట్లో సంప్రదించాలని యూనివర్సిటీ యాజమాన్యం వెల్లడించింది.