Sulakshana Pandit | ప్రసిద్ధ గాయని, నటి సులక్షణా పండిట్ (70) గుండెపోటుతో గురువారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. ఎన్నో అమరగానాలకు స్వరం అందించిన ఈ లెజెండరీ సింగర్ తన గాత్రంతో కోట్లాది మంది హృదయాలను తాకింది. అయితే ఆమె జీవితం సంగీతంలా మధురంగా మొదలై, చివరికి ఒక భగ్న ప్రేమతో ఒంటరితనంలో ముగిసింది.1954లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో సంగీత కుటుంబంలో జన్మించిన సులక్షణా, హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు పండిట్ జస్రాజ్ మేనకోడలు. బాలీవుడ్లో ప్రసిద్ధ సంగీత దర్శకులు జతిన్–లలిత్‌ల సోదరి కూడా ఆమె. చిన్న వయసులోనే గానం ప్రారంభించిన సులక్షణా, 13 ఏళ్లకే లతా మంగేష్కర్తో కలిసి పాడిన ‘తఖ్దీర్’ పాటతో గుర్తింపు తెచ్చుకున్నారు.
తరువాత ‘సంకల్ప్’ సినిమాలోని పాటకు ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. హిందీతో పాటు ఆరు భాషల్లో వందల పాటలు పాడి అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మహమ్మద్ రఫీ, కిశోర్ కుమార్‌లతో కలిసి పాడిన పాటలు ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తుంటాయి. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపైన కూడా ఆమె గానం ప్రతిధ్వనించింది. అయితే గాయనిగా విజయపథంలో ఉన్న సులక్షణా, 1975లో ‘ఉల్ఝన్’ చిత్రంలో నటించిన సంజీవ్ కుమార్‌ని మనసారా ప్రేమించారు. కానీ ఆమె ప్రేమకు ప్రతిస్పందన రాలేదు. సంజీవ్ మనసు అప్పటికే ‘డ్రీమ్ గర్ల్’ హేమమాలినిపైనే ఉండేది. తన ప్రేమ ఎప్పటికీ నెరవేరదని తెలుసుకున్నా సులక్షణా జీవితాంతం అతడినే ఆరాధిస్తూ గడిపారు.
1985 నవంబర్ 6న సంజీవ్ కుమార్ మరణించడంతో ఆమె ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె బహిరంగ జీవితానికి దూరమై, స్వీయ నిర్బంధంలో జీవించారు. చేతిలో ఎన్నో అవకాశాలు ఉన్నా కెరీర్‌ని వదిలేసి, ఒక గదిలోనే జీవితాన్ని గడిపారు. చివరికి నవంబర్ 6న, సంజీవ్ కుమార్ మరణించిన తేదీ నాడు, సులక్షణా పండిట్ కూడా కన్నుమూశారు. ఈ యాదృచ్ఛికం అభిమానులను కదిలిస్తోంది.సంగీతం, ప్రేమ, త్యాగం కలిసిన ఈ గాయని జీవితం ఒక సినిమా కథలా మధురంగానూ, విషాదంగానూ నిలిచిపోయింది.