James Watson | నోబెల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సాన్ (97) తుదిశ్వాస విడిచారు. జీవం ఉనికికి కారణమైన డీఎన్ఏ నిర్మాణాన్ని ఆయనే కనుగొన్నారు. న్యూయార్క్‌కు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 1953లో డీఎన్ఏ డబుల్ హెలిక్స్ ఆవిష్కరణతో ఆయన గుర్తింపు పొందారు. మెలికలు తిరిగిన నిచ్చెన ఆకారంలో ఉన్న డీఎన్ఏ నిర్మాణాన్ని డబుల్ హెలికల్ స్ట్రక్చర్‌గా పిలుస్తారు. ఇందుకుగాను బ్రిటన్ శాస్త్రవేత్త ఫ్రాంసిస్ క్రిక్, మారిస్ విల్కిన్స్‌లతో కలిసి జేమ్స్ డీ వాట్సాన్ 1962లో వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు.
డబుల్ హెలిక్స్ సైన్స్, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అయితే, వివాదాస్పద ప్రకటనలు చేసినందుకు వాట్సన్ తన చివరి సంవత్సరాల్లో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. నల్లజాతీయుల మేధస్సుపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన 2007లో కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబ్ నుంచి సస్పెండ్ చేశారు. జేమ్స్ డీ వాట్సన్ 1928లో చికాగోలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియానా యూనివర్సిటీలో జన్యుశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. 1951లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన కావెండిష్ లేబొరేటరీలో చేరారు. అక్కడే ఆయనకు క్రిక్ పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి డీఎన్ఏపై విస్తృత పరిశోధనలు నిర్వహించారు.