ములుగు, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో ములుగు జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైనా భవన నిర్మాణంపై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు గత సీఎం కేసీఆర్ హయాంలో జిల్లాకో మెడికల్ కాలేజీకి చర్యలు తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం ములుగుకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి తరగతులు ప్రారంభించారు.
2023 సెప్టెంబర్ 28న అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 300 పడకల అనుబంధ దవాఖాన నిర్మాణ పనులకు, జిల్లా కేంద్రంలోని ప్రేమ్‌నగర్ వద్ద రూ.180 కోట్లతో చేపట్టే మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 2024లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా మెడికల్ కాలేజీకి అనుమతులు వచ్చాయి. ఈ క్రమంలో 50 మంది విద్యార్థులకు, 2025 విద్యా సంవత్సరంలో మరో 50 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రస్తుతం 100 మంది విద్యార్థులు ఇక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.
మూడేళ్లు దాటినా పురోగతి శూన్యం
మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగి మూడేళ్లు దాటినా పురోగతి కనిపించడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 16న జీవో నంబర్ 162 జారీ చేసి భవన నిర్మాణం కోసం రూ.180 కోట్లు కేటాయించింది. ఇందుకు గట్టమ్మ ఆలయ సమీపంలో 25 ఎకరాల ప్రభుత్వ భూమిని సమకూర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024లో మెడికల్ కాలేజీకి అనుమతులు సాధించినా నేటికీ పనులు ప్రారంభించలేదు.
ప్రస్తుతం మెడికల్ కాలేజీకి అనుబంధ దవాఖానలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ కళాళాల విద్యార్థులు అరకొర వసతుల మధ్య చదువుకుంటున్నారు. ఇదే ప్రాంగణంలో సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి మారి జీజీహెచ్‌గా ఏర్పడింది. పడకల సంఖ్య పెరిగినా మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బందులెదుర్కొంటున్నారు. నెల రోజుల క్రితం తూతూ మంత్రంగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలకు మార్కింగ్ చేస్తూ హద్దులు ఏర్పాటు చేశారు. భవన నిర్మాణాలతో పాటు వసతులు కల్పించకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ఎంసీ నిబంధనల మేరకు అడ్మిషన్లకు ఇబ్బందులు ఎదురుకాన్నుయి.