అంతర్జాతీయ హంతక, ప్రపంచ విధ్వంసక దేశాలుగా అమెరికా, ఇజ్రాయెల్ స్వైర విహారం చేస్తున్నాయి. అందుకు కారణం అక్కడి ప్రజలు కాదు. ఆ దేశాల బడా కార్పొరేట్లే. వాళ్లు అలా తయారు కావడానికి కారణం.. వాళ్ల మధ్య పోగుబడ్డ సంపద గుట్టలే. సంపద ఎరువు లాంటిది. ఎరువును పొలమంతటా వెదజల్లితే పాడిపంటలు పెంపొందిస్తుంది. అదే ఎరువును కుప్పగా పోస్తే కుళ్లిపోయి కంపుగొడుతూ అందరినీ రోగాలపాలు చేస్తుంది. అలాగే సంపద సమాజం అంతటా చెలామణి అవుతుంటే ప్రజలందరి క్షేమాభివృద్ధిని పెంపొందిస్తుంది. అదే సంపద కొద్దిమంది కార్పొరేట్ల వద్ద పోగుబడితే దాంతో వాళ్లు ఆ దేశ ప్రజలకే కాదు, ప్రపంచ మానవాళికి విధ్వంసకారులవుతారు.
నేడు ఇజ్రాయెల్, అమెరికా దేశాలు మానవాళిపై కొనసాగిస్తున్న దారుణ మారణకాండే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. శవాలెక్కడున్నా వెళ్లడం, అడ్డొచ్చిన వాటిని నెట్టేసి, శవాలను పీక్కుతినటం రాబందుల స్వభావం. సంపద వనరులు ఎక్కడున్నా అక్కడికి వెళ్లడం, అడ్డొచ్చిన ప్రభుత్వాలను కూల్చి, సంపదను దోచుకోవడం బడా కార్పొరేట్ల స్వభావం. అలా దోచుకున్న ధనరాసులతో అమెరికానే కాదు, నేడు ప్రపంచాన్నే శాసిస్తున్నారు. ముఖ్యంగా అమెరికన్ ఆయుధ, ఆయిల్ బడా కార్పొరేట్లు. వాళ్ల దృష్టిలో తమను వేగంగా గమ్యానికి చేర్చే ఖరీదైన వాహనం అమెరికా ప్రభుత్వం.
తాము చెప్పిన దిశగా ఆ వాహనం నడిపే డ్రైవర్ అమెరికా అధ్యక్షుడు. వాషింగ్టన్, అబ్రహం లింకన్, కెన్నెడీ వంటి మానవీయనేతలు తప్ప-రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీ ఏదైనా ట్రంప్, బైడెన్, బుష్ వగైరాలు అందరూ సదరు కార్పొరేట్ల రిమోట్లే. కార్పొరేట్ల కోసం అమెరికా అధ్యక్షుడు విధిగా నిర్వర్తించాల్సిన కర్తవ్యాలు రెండు. ఒకటి వాళ్ల ఆయుధాలను అమ్మిపెట్టడం. రెండోది వాళ్లకు చౌకగా చమురును సమీకరించి పెట్టడం.
అందుకే తరచుగా రెండు దేశాల మధ్య యుద్ధాన్ని సృష్టించి ఆ రెండు దేశాలకు అమెరికా ఆయుధాలు అమ్ముతుంటుంది. ఉదాహరణకు గతంలో పాక్‌ను భారత్‌పైకి ఉసిగొల్పి రెండు దేశాలకు అమెరికా ఆయుధాలు అమ్మడం తెలిసిందే. ప్రపంచ చమురులో 2/3 వంతు అరబ్ దేశాల్లోనే లభిస్తుంది. అందుకే ఆ దేశాల నుంచి తమకు చౌకగా చమురును అందించే నియంతలనైనా కాపాడుతూ తమ చమురు దోపిడీకి అడ్డుపడే ప్రజాప్రభుత్వాలను కూల్చుతుంటుంది అమెరికా. అంతేకాదు అమెరికా కన్నా చౌకగా చమరు అమ్మే ఇరాన్, రష్యాల నుంచి ఆయిల్ కొనకూడదని భారత్‌తోపాటు తమ మిత్ర దేశాలను శాసిస్తుంది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ను, రష్యాపై ఉక్రెయిన్ను యుద్ధానికి ప్రేరేపించి, ఉక్రెయిన్, ఇజ్రాయెల్‌కు భారీగా ఆయుధాలమ్మింది అమెరికా. అలా తమ ఆయిల్, ఆయుధ వ్యాపారుల ధనప్రదాహాన్ని చల్లార్చుతున్నాడు ట్రంప్. అరబ్ దేశాల ప్రవేశానికి ముఖద్వారంలా ఉన్నది ఇజ్రాయెల్. అందుకే అక్కడ మిగిలిన పాలస్తీనీయుల్ని కూడా పారగొట్టి పాలస్తీనా అంతటినీ గ్రేటర్ ఇజ్రాయెల్గా విస్తరింపజేయటం, తమకు బొత్తిగా కొరుకుడు పడని ఇరాన్‌ను అణచివేయటం ద్వారా తమ చమురు దోపిడీకి ఎదురు ఉండదన్న దురాలోచనతోనే పాలస్తీనా, ఇరాన్ మధ్య విధ్వంసానికి నెతన్యాహూ, ట్రంప్‌ను ప్రోత్సహిస్తున్నది సదరు కార్పొరేట్లే.
విదేశీ వనరుల దోపిడీ కోసం ఆదేశంపై తమ సైనిక చర్యకు అమెరికా పెట్టిన ముద్దుపేరు మానవతా జోక్యపు హక్కు. ప్రజలపై ప్రభుత్వాలు చేసే దమనకాండ నుంచి వాళ్లను కాపాడేందుకు సదరు దేశాల్లో మానవతాజోక్యం చేసుకునే హక్కు అంతర్జాతీయ సమాజానికి ఉన్నది అని అంటున్నది అమెరికా.
ఒక దేశపు అంతర్గత వ్యవహారాల్లో మరొకదేశం జోక్యం చేసుకోకూడదు అని ఐక్యరాజ్య సమితి హక్కుల పత్రంలోని ఆర్టికల్-42 స్పష్టీకరిస్తుంది. అమెరికా ప్రతిపాదించిన మానవతా జోక్యపు హక్కును 14-02-2009న ఇరాక్‌లో అమెరికా జోక్యాన్ని తిరస్కరిస్తూ తీర్మానించింది భద్రతా మండలి. 17-03-2011న లిబియాలో అమెరికా జోక్యాన్ని కూడా తిరస్కరించింది. అయినా సరే ఇరాక్, లిబియాలపై ఏకపక్షంగా దాడి చేసి సద్దాం హుస్సేన్, కల్నల్ గడాఫీలను క్రూరంగా హతమార్చింది అమెరికా. వెనెజువెలాపై దాడి చేసి నికోలస్ మదురోను బంధించి తమ వెంట తీసుకెళ్లింది. ఇపుడు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించి, ఖమేనీతో సహా పలువురు కీలక నేతలు, విద్యార్థులు సహా వేలాదిమంది ప్రజలను హతమార్చింది అమెరికా. ఇలా ఇజ్రాయెల్, అమెరికాను అణ్వస్ర్తాలకు మించిన విధ్వంసకారులుగా రూపొందించింది ఆ దేశాల బడా కార్పొరేట్లు, వారి వద్ద పోగుబడ్డ ధనరాశులే.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని అనుకొంటున్న మన భారత్‌లోనూ నెహ్రూగానీ, తదనంతర కాంగ్రెస్, వాజ్‌పేయి, తదనంతర బీజేపీ కూడా దేశ సంపదనంతా కార్పొరేట్ల వద్ద పోగుబెడుతున్నాయ్. ఐదు దశాబ్దాల్లో కార్పొరేట్లను భారత కుబేరులుగా కాంగ్రెస్ మారిస్తే, కేవలం దశాబ్ద పాలనతో వారిని ప్రపంచ కుబేరులుగా ఎదిగేందుకు దోహదపడింది బీజేపీ. వాళ్లను ఇలాగే బలిపిస్తే అమెరికన్ కార్పొరేట్లలా భారత కార్పొరేట్లు కూడా భారతీయులకే కాదు, ప్రపంచానికే పీడకుల్లా రూపొందుతారని అనడంలో సందేహం లేదు. బడా కార్పొరేట్ల రిమోట్‌గా మన పాలు మారిపోతాన్నది చేదు నిజం.
బహుశా ఈ ప్రమాదాన్ని గుర్తించే కాబోలు, భారతదేశానికి కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడటం అవశ్యం అని గత ఎన్నికల సందర్భంగా ప్రకటించారు కేసీఆర్. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ దిశగా దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైనది.
మనది వ్యవసాయాధారిత దేశం కనుక వ్యవసాయాభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. విద్య, వైద్యరంగాల పట్ల ప్రభుత్వ బాధ్యత, ప్రాధాన్యత పెంపొందించాలి. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ బలోపేతం చేయాలి. సంపద వికేంద్రీకరణ ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ క్రమంగా పేదరిక రహిత దేశంగా భారత్‌ను రూపొందించటం. తద్వారా రాష్ర్టాలను, దేశాన్ని ప్రగతిపథాన పరుగెత్తించటం అనే మ్యానిఫెస్టో ప్రాతిపదికన వామపక్షాలతో సహా కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రపంచంలోనే వేగవంతంగా తెలంగాణ రాష్ర్టాభివృద్ధిని సాధించిన రాజనీతిజ్ఞుడు, నిరంతర అధ్యయనశీలి అయిన కేసీఆర్ సారథ్యాన కూటమిగా ఏర్పడటం దేశ క్షేమాభివృద్ధి సాధనకు అవశ్యమన్నది సామాజిక శ్రేయోభిలాషుల ఆకాంక్ష.
– పాతూరి వెంకటేశ్వరరావు 9849081889