అందరికీ అన్నంపెట్టే రైతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన పంటను అమ్ముకొనేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నది. 55 రోజులుగా మక్కలు కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని, మార్క్ఫెడ్ అధికారులను ప్రశ్నించిన పాపానికి రైతులు, వారికి మద్దతు తెలిపిన వారిపై అక్రమ కేసులకు పూనుకుంటున్నది. ఈ నేపథ్యంలో వారి హకుల
కోసం పోరాడిన రైతులపై అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్, రైతు సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు తాళం వేసిన ఘటనలో కేసు నమోదైన వారు రైతులు కాదని చింతకాని పోలీసులు విడుదల చేసిన ప్రకటనపై మండిపడ్డారు.
చింతకాని, మే 25: చింతకాని సొసైటీ పరిధిలోని రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి, కాంటా వేసినప్పటికీ సరుకును తరలించడానికి అధికారులు లారీలను పంపించలేదు. అరకొరగా వచ్చిన లారీలను కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికి మాత్రమే కేటాయించారు. ప్రైవేట్ లారీలు బస్తాకు రూ.80 వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో 55 రోజులుగా మక్కల బస్తాలు తరలించకపోవడంతో రైతులు పడిగాపులు కాశారు.
తమ పంటను కొనుగోలు కేంద్రాల నుంచి త్వరితగతిన తరలించాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ఈనెల 22న చింతకాని సొసైటీ కార్యాలయం వద్ద మక్క రైతులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులు చెప్పినవిధంగా సొసైటీ సిబ్బంది వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం పంపిస్తున్న లారీలను మాత్రమే కేటాయించాలని, అదనంగా డబ్బులు వసూలు చేసే లారీలు వద్దంటూ ఆందోళన నిర్వహించారు. అనంతరం సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎంతమందిపై కేసు నమోదు చేశారనే అంశాన్ని గోప్యంగా ఉంచారు. కేసు నమోదుకు సంబంధించి వివరాలు అడిగినప్పటికీ చెప్పకపోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం ఉన్నదని, ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేయడంపై రైతులు మండిపడుతున్నారు.
లారీల కోసం జరిగిన ఆందోళనలో పాల్గొన్న రైతులైన బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ పొనుగుటి రత్నాకర్, మండల నాయకులు జనగాబోయిన కిష్టయ్య, ఆకుల చంద్రయ్యను రాజకీయ నాయకులుగానే చిత్రీకరిస్తూ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పబట్టారు. వందలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొంటే.. కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే కేసు నమోదు చేసి, వారు రైతులు కాదంటూ ఎస్సై వీరేందర్ సోమవారం ప్రకటన విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉన్నదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నంత మాత్రాన తాము పండించిన పంటను కాపాడుకునే హకు లేదా? అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ ఘటనపై ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు విలేకరులతో మాట్లాడుతూ.. సకాలంలో పంట కొనుగోలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం.. అసలు రైతు ప్రభుత్వమే కాదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో వైఫల్యాలపై వస్తున్న విమర్శలను తట్టుకోలేక, కాంగ్రెస్ నాయకులు పోలీసులతో కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. రైతుల సంక్షేమాన్ని పకనపెట్టి రాజకీయ కక్షతో పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
చింతకాని సొసైటీ కార్యాలయానికి తాళం వేసిన ఘటనలో రైతులపై కేసులు పెట్టారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని ఎస్సై ఎన్ వీరేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 22న చింతకాని సొసైటీ వద్ద మక్కజొన్న తరలింపునకు లారీల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీపీ పొనుగోటి రత్నాకర్, జనగబోయిన కిట్టయ్య, ఆకుల చంద్రయ్యలు.. తమ పార్టీకి చెందిన వారికే ముందుగా లారీలు పం పించాలంటూ పట్టుబట్టారు. అంతేకాక అక్కడున్న రైతులు, సొసైటీ సిబ్బందిని కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకుని గేటుకు తాళం వేశారు. సొసైటీ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశామని వివరించారు.