నిజామాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ధాన్యం, పప్పులు, ఆయిల్ సీడ్స్ వంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం ఏటా కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఏటా వానకాలం ఆరంభానికి ముందు మద్దతు ధరను వెల్లడిస్తుంది. ఇందులో పసుపు పంటకు చోటుదక్కడం లేదు. పేరుకు జాతీయ పసుపుబోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, మద్దతు ధర జాబితాలో మాత్రం ఈ పంటను చేర్చలేదు. 2026-27లోనూ వివిధ పంటల ఎమ్మెస్పీ జాబితాలో పసుపు పంట కన్పించలేదు. ఏటా జనవరి నెలలో ప్రాసెసింగ్ మొదలై, మే చివరాఖరు వరకు పసుపు కొనుగోలు ప్రక్రియ నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో జరుగుతుంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలోని పసుపు పంట ఇక్కడికే వచ్చి చేరుతుంది.
లక్షల క్వింటాళ్ల పసుపును వ్యాపారులు ఈ-నామ్ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. 2026 కొనుగోళ్ల సీజన్ ముగింపునకు చేరుతున్నా పసుపు రైతులకు ఊరట దక్కలేదు. క్వింటాకు కేవలం రూ.12వేల వరకే ధర వస్తున్నది. ఒకరిద్దరికీ మంచి ధరను కల్పించి, దానిని గరిష్ఠ ధరగా చూపించి మార్కెట్ యార్డు అధికారులు గిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. చాలామందికి కనిష్ఠంగా రూ.9 వేల నుంచి రూ.12 వేలలోపే గిట్టుబాటు ధర వస్తుండటంతో రైతులకు నష్టాలు తప్ప లాభాలు ఉండటం లేదు.
పసుపు సాగుకు నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధి చెందింది. దేశంలోనే ముఖ్యమైన మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నది. 2025-26 సీజన్లో (ప్రస్తుతం) 20,120 ఎకరాల్లోనే పసుపు పంట సా గయినట్టు వ్యవసాయ శాఖ అంచనాలు పేర్కొన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 70 వేల నుంచి 80 వేల టన్నులు ఉత్పత్తి అంచనా. తెలంగాణ మొత్తం 1.33 లక్షల టన్నులుగా ఉన్నది. గతంలో 2024-25 సీజన్ ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 22,941 ఎకరాలు సాగైంది. తెలంగాణలో మొత్తం పసుపు సాగులో నిజామాబాద్ జిల్లాలో 54.49 శాతంగా ఉన్నది. 2023-24లో 20,650 ఎకరాలు అంటే 47.73శాతంగా ఉన్నది.
దిగుబడి సగటు హెక్టార్‌కు 8,100 కిలోలుగా, ఎకరానికి 3,278 కిలోలుగా ఉన్నది. 2015-16లో తెలంగాణలో మొత్తం సాగు 42,535 హెక్టార్లు. ఉత్పత్తి 1.84లక్షల టన్నులు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలు రాష్ట్ర ఉత్పత్తిలో 90 శాతం వాటా కలిగి ఉన్నాయి. కేసీఆర్ హయాంలో 35 వేల నుంచి 40 వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన ఈ రెండున్నరేండ్ల కాలంలో క్రమంగా సాగు విస్తీర్ణం పడిపోతున్నది. పంటలకు రూ.500 బోనస్ ఇస్తామ ని చెప్పి సన్న వడ్లకు మాత్రమే పరిమితం చేయడంపై పసుపు రైతులు మండిపడుతున్నారు.
9 నెలల పసుపు పంట సాగులో దుక్కి దున్నించడంతో మొదలు పెడితే పసుపు తవ్వి, ఉడుక బెట్టి, మార్కెట్‌కు తరలించేంత వరకు దాదాపుగా ఎకరానికి రూ.లక్షన్నర వరకు ఖర్చు అవుతున్నది. కాలం కలిసి వస్తే ఎకరానికి దిగుబడి 25 క్వింటాళ్లు చేతికి వస్తుంది. మార్కెట్లో అన్నీ అనుకూలించి రూ.12వేలు ధర పలికితే రూ.3 లక్షలు ఆదాయం సమకూరుతున్నది. కానీ మార్కెట్లో గడ్డు పరిస్థితుల వల్ల రూ.9 వేలు దాటితే గగనమయ్యే దుస్థితి ఉన్నది.
పసుపు పంటకు సరైన ధర రావడం లేదు. నిజామాబాద్ మార్కెట్లో అందరూ ఒక్కటయ్యారు. ఇష్టమొచ్చినట్టుగా ధర నిర్ణయిస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురు దబాయిస్తున్నారు. నేను తెచ్చిన పంటకు క్వింటాకు రూ.12 వేలు మాత్రమే వచ్చింది. ఇదీ ఏ మూలకూ సరిపోదు.
– గంగాధర్, పసుపు రైతు
పసుపు పంట సాగు చేయడం ద్వారా నష్టాలే తప్ప లాభం చూడటం లేదు. ఈ మధ్య కాలంలో వ్యాపారుల దోపిడీ ఎక్కువైంది. కొద్దిమందికి మాత్రమే అధిక ధర చూపిస్తున్నరు. అది చూసిన తర్వాత నిజామాబాద్‌కు పసుపు తీసుకువస్తే తక్కువ ధర ఇస్తున్నారు. వ్యాపారులు కలిసి ఆడుతున్న నాటకాలకు రైతులం బలి అవుతున్నాం.
– నాగోరావు, పసుపు రైతు