ఇల్లెందు, మే 25 : విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రైవేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ, పీవోడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఇల్లెందు మండలం కొమరారం గ్రామంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కొమరారం సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ, పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు యదలపల్లి సావిత్రి, పీవైఎల్ నాయకుడు బాదావత్ రమేశ్‌లు మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఫీజుల నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెబుతున్నా.. అక్కడ మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మండిపడ్డారు. ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు బుర్ర రాఘవులు, నాయకులు చిర్ర కృష్ణ, కోటి, బండారి సత్యం, సీతాఫల చార్లెస్, వెంకన్న, ముత్తక్క, యమున, కృష్ణవేణి, శ్రావణ్, రాములు, జగ్గులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.