అనంతగిరి, ఆగస్టు 05 : తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అనంతగిరి మండలంలోని పాలవరం అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మట్టపల్లి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. పిల్లలకు తల్లిపాలు శ్రేయస్కరమని, ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆరు నెలల పాటు తల్లిపాలు అవసరమన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. తల్లిపాలే ఉత్తమమైన ఆహారమని, పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ కనబరచాలని చెప్పారు. అనంతరం తల్లిపాల ఆవశ్యకత, పోషకాహారంపై అవగాహన కరపత్రాలను పిల్లల తల్లిదండ్రులకు పంచారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రమాదేవి, సైదమ్మ, ఆశా వర్కర్లు, ఆయాలు, గ్రామ మహిళలు పాల్గొన్నారు.