సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, మే 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో ఈనెల 23న జరిగిన అడ్వకేట్ ఖాజామొయిజుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని బెంగళూరు హైవేపై స్వాధీనం చేసుకుని కారును విక్రయించిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. భూతగాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా ఇంటినుంచి బయటకు వచ్చిన ఖాజా మొయిజుద్దీన్‌ను నిందితులు స్కార్పియోతో ఢీకొట్టి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ కారును గతంలో విక్రయించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అతను తాను ఆ వాహనాన్ని 6 నెలల క్రితమే అమ్మేశానని చెప్పడంతో ఆ వాహనం ఎవరి వద్ద ఉందన్న అంశంపై లోతుగా ఆరా తీశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తూ వినయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. కేసులో మరికొంతమంది అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ కేసులో కాంగ్రెస్ నాయకులు మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అందులో ముజాహిద్ పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతనిది ఈ కేసులో కీలక పాత్రగా అనుమానిస్తున్నట్లు ఒక పోలీస్ అధికారి వెల్లడించారు.
6 నెలల క్రితమే ఈ హత్యకు ప్రణాళిక రచించారని, ఇందుకోసం కిషన్ అనే వ్యక్తి కవాడిగూడకు చెందిన నవీన్ అనే వ్యక్తికి 10 లక్షల రూపాయల సుపారీని ఇచ్చినట్లు పోలీసులకు నవీన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. హత్య చేయడానికి ఐదురోజుల ముందునుంచే మొయిజుద్దీన్ ఉండే శాంతినగర్‌లో నిందితులు రెక్కీ నిర్వహించారు. ఈ హత్యలో ఐదుగురు నిందితులున్నట్లుగా తేల్చిన పోలీసులు నిందితుడు తన కారుతో మొయిజుద్దీన్‌ను ఢీకొట్టినట్లుగా చెప్పారు. తన వాహనానికి నెంబర్ ప్లేటు తీసేసి ఈ హత్యలో పాలుపంచుకున్నారని, మిగతా నిందితులను కూడా పోలీసులు కల్వకుర్తి, గోవాలో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్దీన్ ఆలంఖాన్‌ను బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద అదుపులోకి తీసుకుని అనంతరం అబిడ్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు.
సీపీ సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు..
నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, మొయిజుద్దీన్ కుమారుడు ఫర్హాన్, కొందరు అడ్వకేట్ల బృందం సోమవారం నగర సీపీ సజ్జనార్‌ను కలిసి హత్యకు సంబంధించిన వివరాలు, పోలీసుల విచారణపై చర్చించారు. ఇందులో ప్రధానంగా మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్లు కాంగ్రెస్ పార్టీ నేతలు కావడంతో విచారణపై ప్రభావం పడే అవకాశముందని, ఈ హత్యపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలని వారు కోరారు. నిందితులకు శిక్ష పడేలా చూడాలని, ఇది పక్కాప్లాన్‌తో చేసిన హత్యేనని సీపీని కలిసిన వారు చెప్పినట్లు తెలిసింది. సజ్జనార్ వారికి ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
కేసు నమోదు చేసిన మానవహక్కుల కమిషన్..!
తెలంగాణ హైకోర్టు న్యాయవాది మొయిజుద్దీన్ హత్యకు సంబంధించి అడ్వకేట్ రామారావు ఇమ్మానేని ఫిర్యాదు మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పరిపాలనా పక్షపాతం, నిర్లక్ష్యం చోటు చేసుకున్నట్లు రామారావు తన ఫిర్యాదులో ఆరోపించారు. నిందితులు మహబూబ్ ఆలంఖాన్, ముజాహిద్ ఆలంఖాన్లు కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఆ ఇద్దరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలతోనూ సంబంధాలు ఉన్నాయనే అనుమానాలను వ్యక్తం చేస్తూ కేసుపై స్వతంత్రంగా కమిషన్ విచారణ చేపట్టాలని రామారావు కోరారు. ఈ ఫిర్యాదులో సీనియర్ పోలీస్ అధికారి స్వాతి లక్రాను ప్రతివాదిగా చేర్చామని, కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని కమిషన్‌ను కోరారు. బాధిత న్యాయవాది కుటుంబానికి తక్షణ రక్షణ కల్పించాలని రామారావు కోరారు.