కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నది ప్రక్షాళన పేరిట తీరం అమ్మకానికి సర్కార్ ప్రణాళికలు రచిస్తున్నదని నిపుణులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా నది తీరాలలోని భూమి వినియోగమార్పిడి, కాంక్రీట్ నిర్మాణాల వల్ల ఆర్థిక అభివృద్ధి సాధిస్తామని చెప్పడం సరైన విధానం కాదు. నదులు కలిగిన నగరాల్లో మురుగునీటి వ్యవస్థ దశాబ్దాల క్రితమే నిర్మితమై ఉన్నది. సంస్థాగతమైన పరిపాలన, రవాణా, మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెంది ఉన్నాయి. ఇప్పుడు నది ప్రక్షాళన, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వృద్ధి పేరుతో ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న ప్రణాళికల ఆంతర్యాలేమిటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించుకుంటూ తెరపైకి తెచ్చింది. వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కూడిన ప్రాజెక్టుతో మూసీకి పునరుజ్జీవం కల్పిస్తామని చెప్తున్నది. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వివాదంలో చిక్కుకున్నది. మూసీ తీర ప్రాంతాల్లోని ప్రజలను నిర్వాసితులు చేయడం, ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచడం ఇందుకు కారణం. ఇటీవల మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్-(ఎంఆర్డీసీఎల్) ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం చూస్తే ఈ ప్రాజెక్టులో కొత్తదనం ఏమీ కనిపించడంలేదు.
గండిపేట్-లంగర్‌హౌజ్ కారిడార్ నుంచి తూర్పు-పశ్చిమ రహదారి, గాంధీ సరోవర్ రూపకల్పన, నదీతీరం సుందరీకరణ వరకు ఇవన్నీ గతంలో 1998 నాటి నుంచి ప్రచారంలో ఉన్న ప్రభుత్వాల ప్రతిపాదనలను పోలి ఉన్నాయి. ఇది కొత్త ప్రాజెక్ట్ కాదనేది ప్రధానమైన విషయం. ఇక మారింది ఏంటంటే కేవలం ప్రాజెక్ట్ వ్యయం, కన్సల్టెంట్ కంపెనీ మాత్రమే.
ఎంఆర్డీసీఎల్ ప్రజెంటేషన్ ప్రకారం కన్సల్టెంట్ కంపెనీ ఫీజు రూ.160 కోట్లు. మరి ఇంత ఫీజు తీసుకున్న కన్సల్టెంట్ కంపెనీ కొత్త ఆలోచనలు ఏమైనా చేసిందా? కొత్త ప్రతిపాదనలు ఏమైనా రూపొందించిందా అంటే అదీ లేదు. ఒకప్పటి పాలకులు తెరపైకి తీసుకొచ్చి వాయిదా వేసిన అదే ప్రాజెక్టును వ్యయం పెంచి మళ్లీ ఖరీదైన ప్యాకేజీగా రూపకల్పన చేశారని స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో కొన్ని నిరర్థకమైన వాదనలు, అసత్యాలు గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు నగరాలు, అక్కడి నదుల తీరాల వల్ల ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని చెప్పడం నిరాధారం. వాస్తవాలను గమనిస్తే ఈ వాదన నిలబడదు. కానీ ఇదే అంశాన్ని ప్రజెంటేషన్‌లో ప్రభుత్వం నొక్కి చెప్తూ వచ్చింది. భూమి వినియోగ మార్పిడి, నదీ గర్భంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం సంపదను సృష్టించే నమూనా గా చూడకూడదు. భూమి విలువ పెంపు, మెరుగైన రవాణా సదుపాయాల కల్పన, ఉద్యోగ కల్పన వికేంద్రీకరణ, వాణిజ్యపరంగా స్థలాలు అందుబాటులో ఉంచే విధానాలు, సమాజంలోని అందరినీ భాగస్వాములు చేయడం, పట్టణ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల ద్వారా మాత్రమే నిజమైన ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది.
కానీ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ఇవేమీ కనిపించడంలేదు. పైగా ప్రభుత్వం ప్రస్తావించిన నగరాల జాబితా చూసినా ఎంపిక చేసిన కొన్నింటిని ప్రస్తావించినట్టుగా గమనించవచ్చు. పోనీ ఆయా నదీతీరాల్లో జరిగిన అభివృద్ధిగా చెప్తున్న నమూనా తీరుతెన్నులను పరిశీలించినా కాంగ్రెస్ సర్కార్ వాదన అసంబద్ధమే అనే విషయం స్పష్టమవుతుంది. ప్రజెంటేషన్‌లో పేర్కొన్న సియోల్‌లోని చియాంగ్గ్యెచియాన్ తీరం. ఇది పంపింగ్ చేసిన నీరు ప్రవహించే ఒక కాంక్రీట్ చానల్. దీని నిర్వహణ భారం కూడా చాలా అధికం అనే విమర్శలు ఉన్నాయి.
పర్యావరణపరంగా ఇదొక డొల్ల ప్రాజెక్టు అని కొరియన్ సంస్థలు తమ అధ్యయనంలో పేర్కొన్నాయి. అంతేకాకుండా ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టిన నగరాల్లో అంతకు దశాబ్దాలకు ముందే మురుగునీటి పారుదల, సంస్థాగతమైన పరిపాలన, రవాణా వ్యవస్థలు అభివృద్ధి చెంది ఉన్నాయి. అక్కడ నదీ తీర అభివృద్ధి అనేది చివరగా చేపట్టిన ప్రాజెక్టే తప్ప, మొదటగా చేపట్టిన ప్రాజెక్టు కాదు. హైదరాబాద్ విషయానికి వస్తే ఈ క్రమానికి ప్రభుత్వం తిరోగమనంలో వెళ్తున్న ట్టుగా కనిపిస్తున్నది. ప్రాజెక్ట్ పూర్తయితే ఇలా ఉంటుంది అంటూ ప్రభుత్వం చెప్తున్నది కానీ, వాటిని ఎలా నిర్వహిస్తారు? అందుకోసం రూపొందించే వ్యవస్థలు ఏంటి? నిర్వహణ వ్యయం ఎంతో చెప్పడంలేదు.
గోదావరి నీటిని తరలించి మూసీలోకి వదులుతామని ప్రభుత్వం చెప్తున్నది. మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా శుద్ధ జలాలను నదిలో నింపడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్ అంచనా ప్రకారం 2051 వరకు 62 ఎస్టీపీలు అవసరం. కానీ ప్రభుత్వ ప్రణాళికలో స్పష్టతలేదు. మురుగునీటిపై స్పష్టత ఇవ్వకుండా నదీతీరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంలో అర్థంలేదు. కానీ మొదటిదశ ప్రాజెక్టుకు రూ.6,500-7,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా.
ప్రభుత్వం చెప్తున్న ప్రజెంటేషన్ ద్వారా మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. హైదరాబాద్ పరిధిలోని 55 కిలోమీటర్ల పొడవైన నదీతీర అభివృద్ధి ద్వారా లాభాలు కలుగుతాయని ప్రభుత్వం పదేపదే చెప్పుకొస్తున్నది. కానీ ఎవరికి లాభాలు కలుగుతాయి? అనేది ప్రశ్న. దీనికి సమాధానం బహిరంగ రహస్యమే. ఇక మూసీ ప్రాజెక్టులో భాగంగా జీవో ఆర్టీ నంబర్ 921 ద్వారా ప్రభుత్వం 46 కాలనీలను తొలగించాలని భావిస్తున్నది. అంతేకాకుండా ఇండ్లను కూల్చడం, ప్రజలను అక్కడి నుంచి తరలించడం కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చేపట్టకూడదని నిర్ణయించింది. అప్పుల భారంతో ఉన్న ఒక రాష్ట్ర ప్రభుత్వం నదీతీర అభివృద్ధి ద్వారా అక్కడి భూముల విలువ పెంచుతామని చెప్పినా అది పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధిగా పరిగణనలోకి తీసుకునే పరిస్థితి ఉండదు.
మూసీ ప్రాజెక్టులో ప్రధానమైన అంశమైన మురుగునీటి వ్యవస్థ. ఈ విషయాన్ని ప్రజెంటేషన్‌లో బహిర్గత పర్చకపోవడం ప్రజలను మోసం చేయడమే అవుతుంది. నగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలితే నది ప్రక్షాళన జరగదు అని ఎంఆర్డీసీఎల్ ఎండీ ప్రకటించారు. కానీ ఆ తర్వాత చెప్పిన విషయాలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 675 చదరపు కిలోమీటర్ల పరిధిలో 54 నాలాలు ఉన్నాయి. 30 కిలో మీటర్ల పరిధిలోనే 51 నాలాలు నదిలో కలుస్తున్నాయి. నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిలో సుమారు 94శాతం మూసీలోకి వెళ్తున్నది. ఈ నాలాలు మొత్తం మూసీకి అనుసంధానమై ఉన్నాయి. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మొదటిదశ గండిపేట్-లంగర్‌హౌజ్ కారిడార్‌కు పరిమితం కాలేదు. కానీ ప్రభుత్వం స్పష్టతనివ్వడంలేదు. సాధారణంగా ఎవరైనా ఇంజినీర్ అడిగే మొదటి ప్రశ్నలు ఇలా ఉంటాయి. ప్రస్తుతం నగరంలో ఎంత మురుగునీరు ఉత్పత్తి అవుతున్నది? భవిష్యత్తులో అంటే 2040-50 వరకు ఎంత పెరుగుతుందని భావిస్తున్నారు? ఆ మురుగు నీరు ఎక్కడికి వెళ్లాలి? అనే విషయాలు చర్చించలేదు.
నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మురుగునీటి ప్రవాహానికి సరైన వ్యవస్థ లేదు. గృహ వ్యర్థజలాలు, మురుగునీరు నాలాల్లోకి వెళ్తుంది. ప్రస్తుతం మురుగునీటి శుద్ధి ప్లాంట్లు అంబర్పేట్, నాగోల్, అత్తాపూర్‌ల్లో ఉన్నాయి. ఇవి ప్రభుత్వం చెప్తున్న మొదటిదశ కారిడార్‌కు చాలా దూరంలో ఉన్నాయి. గోదావరి నీటిని తరలించి మూసీలోకి వదులుతామని ప్రభుత్వం చెప్తున్నది. మురుగునీటి సమస్యను పరిష్కరించకుండా శుద్ధ జలాలను నదిలో నింపడం ద్వారా సమస్య పరిష్కారం కాదు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డ్ అంచనా ప్రకారం 2051 వరకు 62 ఎస్టీపీలు అవసరం. కానీ ప్రభుత్వ ప్రణాళికలో స్పష్టతలేదు.
మురుగునీటిపై స్పష్టత ఇవ్వకుండా నదీతీరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంలో అర్థంలేదు. కానీ మొదటిదశ ప్రాజెక్టుకు రూ.6,500 కోట్లు-7,000 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వ వర్గాల అంచనా. అంతర్జాతీయంగా నదీతీరాల అభివృద్ధి ప్రాజెక్టులు విజయవంతమైన చోట వాళ్లు నిర్మాణ, నిర్వహణ వ్యయాల గురించి మొదటి నుంచే స్పష్టత కలిగి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ప్రాజెక్టులో ఖర్చు లు, ఆదాయ వనరుల పూర్తి వివరాలు లేవు.
కేవలం 21 కిలో మీటర్ల పరిధిలో కాకుండా మూసీ బేసిన్ మొత్తంపై అధికారం కలిగి ఉండేలా ప్రభుత్వం చట్టబద్ధమైన అథారిటీని ఏర్పాటు చేయాలి. ఒక్క ఇంటిని తొలగించాలన్నా మెరుగైన పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి. ఇది కూడా చట్టబద్ధంగా ఉండాలి. జీవో, ఆదేశాలతో కాదు. మురుగు నీటిపై అంచనా, ప్రాజెక్ట్ నిర్మాణ, నిర్వహణ ఖర్చులపై స్పష్టత ఇవ్వాలి. దశల వారీ ప్రణాళికలను ప్రజల ముందు పెట్టాలి. కాంక్రీట్ నిర్మాణాలను పర్యావరణ పునరుద్ధరణగా చూపించే ప్రయత్నాలను మానుకోవాలి.
(సౌత్‌ఫస్ట్ సౌజన్యంతో)
– దొంతి నరసింహారెడ్డి