హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వ తీరు మారదా? అంటూ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సినిమా టికెట్ ధరలను పెంచబోమని హామీ ఇవ్వడం, కొత్త సినిమా విడుదల సమయంలో మళ్లీ పెంపునకు అనుమతించడం సాధారణమైపోయిందని వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే.. సినిమా టికెట్ ధరలను పెంచరాదన్న ఉత్తర్వులకు విరుద్ధంగా ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమో జారీచేసిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీ చంద్రబాబు అనే వ్యక్తి కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్.. సినిమా టికెట్ ధరలను పెంచరాదని హైకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2021లో జారీచేసిన జీవో 120 ప్రకారం సినిమా థియేటర్లను వర్గీకరించి టికెట్ ధరలను నిర్ణయించాలన్న హైకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా టికెట్ ధరల పెంపునకు ఆరేడు మెమోలు జారీ చేయడంలో అర్థమేంటని నిలదీస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు.