ప్రజా సంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో మూసీకి రెండువైపులా కిలోమీటర్ చొప్పున భూములను సేకరించి ‘అభివృద్ధి కారిడార్’గా రూపొందిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై వ్యతిరేకత రావడంతో ‘తూచ్’ అనేసింది. బఫర్ జోన్‌కే పరిమితం అవుతామని చెప్పింది.
మూసీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ స్టార్ హోటల్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. బఫర్ జోన్ నదికి రెండువైపులా 50 మీటర్లు మాత్రమేనని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) ఎండీ నర్సింహారెడ్డి ప్రకటించారు.
‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’లో భాగంగా ప్రభుత్వం తొలి భూసేకరణ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో బఫర్ జోన్‌కు దూరంగా ఉన్న నిర్మాణాలకు సైతం నోటీసులు జారీచేసింది.
మూసీకి రెండువైపులా కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మాణాల త్రీడీ డిజిటల్ మాడలింగ్ కోసం ఎంఆర్డీసీఎల్ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. 21 కిలోమీటర్ల పొడవున నదికి రెండువైపులా 42 చదరపు కిలోమీటర్ల పరిధిలో 3డీ డిజిటల్ మాడలింగ్ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నదనేది పచ్చి నిజం. లక్షలాది ఇండ్లను కూల్చి, లక్షలాది మందిని నిరాశ్రయులను చేసి, పెద్దల జేబులు నింపనున్నదనేది కఠోర వాస్తవం. నదికి ఇరువైపులా 50 మీటర్లు మాత్రమే బఫర్ జోన్ అని ప్రభుత్వం, అధికారులు పైకి చెప్తున్నా, రెండు వైపులా కిలోమీటర్ మేర నిర్మాణాలను కూలగొట్టబోతున్నారు. గతంలో, తాజాగా దొరికిన ఆధారాలను విశ్లేషిస్తే ఇది స్పష్టమవుతున్నది.

ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కాకుండా కేవలం ఎంఆర్డీసీఎల్ వెబ్సైట్లోనే కనిపిస్తున్న
టెండర్ నోటిఫికేషన్లు

మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన త్రీడీ డిజిటల్ మాడలింగ్ టెండర్ నోటిఫికేషన్
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘పంచ పాండవులు ఎంతమంది అంటే.. మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురు అని చెప్పి, రెండు వేళ్లు చూపారట’.. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇదే మాదిరిగా ఉన్నాయి. మూసీ సుందరీకరణలో సమిధలయ్యే సామాన్యుల నిర్మాణాల లెక్కపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ఇదే సామెతను వల్లెవేస్తున్నది. నదికి ఇరువైపులా భూసేకరణ ఎంతవరకు చేస్తారు? ఎన్ని నిర్మాణాలను తొలిగిస్తారు? ఎంత మంది నిరాశ్రయులవుతారు? వంటి వివరాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడమే లేదు. ప్రభుత్వ ప్రజెంటేషన్లు, అధికారిక వేదికలు, శాసనసభలోనూ ఏ ప్రాతిపదికన మూసీ సుందరీకరణ కోసం భూసేకరణ చేస్తారనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయడమే లేదు.
గతంలో ప్రజాసంఘాలకు ఇచ్చిన ప్రజెంటేషన్‌లో మూసీకి రెండువైపులా కిలోమీటర్ చొప్పున భూములను సేకరిస్తామని, దానిని అభివృద్ధి కారిడార్‌గా రూపొందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ‘తూచ్..’ అనేసింది. బఫర్జోన్కే పరిమితం అవుతామని ప్రకటించింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓ స్టార్ హోటల్లో ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో ఎంఆర్డీసీఎల్ ఎండీ నర్సింహారెడ్డి సాంకేతిక వివరాలను 50 మీటర్ల బఫర్జోన్కే పరిమితం చేశారు. కానీ ఎన్ని నిర్మాణాలపై ప్రభావం ఉంటుందనే వివరాలను మాత్రం ఎక్కడా చెప్పలేదు. కానీ, మొదటి దశలో ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ కోసం విడుదల చేసిన తొలి భూసేకరణ నోటిఫికేషన్లో, బఫర్‌జోన్‌కు దూరంగా ఉన్న నిర్మాణాలకు సైతం నోటీసులు జారీఅయ్యాయి. దీంతో నదికి ఇరువైపులా కిలోమీటర్ మేర భూమి సేకరిస్తారనేది స్పష్టమైంది.
తాజాగా మరో ఆధారం బయటపడింది. మూసీకి రెండువైపులా కిలోమీటర్ దూరంలో ఉన్న నిర్మాణాల త్రీడీ డిజిటల్ మాడలింగ్ కోసం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ‘నమస్తే తెలంగాణ’ గత ఏడాదికాలంగా చెబుతున్నట్టుగానే రెండువైపులా కిలోమీటర్ చొప్పున ప్రాంతాన్ని కారిడార్‌గా ఎంచుకొని మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోనున్నారనేది రుజువైంది. అంటే 55 కిలోమీటర్ల పొడవున 110 కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల మేర భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ ప్రాంతంలో లక్షకు పైగా నిర్మాణాలు ఉన్నాయనేది ప్రాథమికంగా గూగుల్‌ను పరిశీలిస్తేనే అర్థమవుతుంది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అధికారిక పత్రాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ అత్యంత గోప్యత పాటిస్తున్నది. ప్రాజెక్టు అంచనా వ్యయం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్), ప్రాజెక్టులో భాగంగా ఎంత భూమిని సేకరిస్తారు? ఎన్ని ఇండ్లను తొలగిస్తారు? అన్న వివరాలను గుట్టుగా ఉంచుతున్నది. గెజిట్‌లో ఒకటి ఇచ్చి, వేదికలపై మరొకటి చెప్తూ, గుట్టుచప్పుడు కాకుండా లక్షలాది ఇండ్లను మూసీ నీళ్లతో ముంచబోతున్నది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి, ప్రాజెక్టుపై పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కూడా వివరాలను వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నారు. సీఎం, మంత్రులు, ఎంఆర్డీసీఎల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇలా ఎవరికివారు పొంతనలేని విధంగా ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తుండటంతో మూసీ పరీవాహక ప్రాంతంలోని ప్రజల్లో ఆందోళన పెరిగిపోతున్నది.
రెండు రోజుల కిందట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి ప్రణాళికే లేదని, వెల్లడించే వివరాల్లో ఎక్కడా పొంతనలేదని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి సమయంలో ఎంఆర్డీసీఎల్ అధికారులు గోప్యంగా ఉంచిన టెండర్ నోటిఫికేషన్ ఒకటి సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. మూసీకి రెండువైపులా కిలోమీటర్ పరిధిలోని నిర్మాణాల త్రీడీ డిజిటల్ ట్విన్ మాడలింగ్ కోసం ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.18 లక్షల అంచనా విలువతో ఆ టెండర్ నోటిఫికేషన్ (05/ఈఈ/ఎంఆర్డీసీఎల్/2025-26)ను జారీ చేశారు.
ప్రభుత్వం 5 దశల్లో చేపట్టనున్న సుందరీకరణ ప్రాజెక్టులో తొలి దశ (గాంధీ సరోవర్)గా 21 కిలోమీటర్ల పొడవున (హిమాయత్‌సాగర్-బాపూఘాట్, గండిపేట-బాపూఘాట్) చేపడుతున్నందున, నదికి రెండువైపులా 42 చదరపు కిలోమీటర్ల పరిధిలో త్రీడీ డిజిటల్ మాడలింగ్ చేసేందుకు నిర్ణయించారు. వాస్తవానికి 2025 చివరలోనే గోప్యంగా ఈ టెండర్లు పిలిచినా బిడ్డర్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. దీంతో గత నెల ఆరో తేదీన రెండోసారి (రీకాల్) నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ టెండర్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఏజెన్సీని ఎంపిక చేశారా? త్రీడీ డిజిటల్ మాడలింగ్ ప్రక్రియ మొదలుపెట్టారా? అనే సమాచారం మాత్రం బయటికి పొక్కకుండా అధికారులు గోప్యంగా వ్యవహరిస్తున్నారు.
సాధారణంగా ప్రభుత్వ శాఖలు, విభాగాలు ఇచ్చే టెండర్ నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో కాకుండా వాటిని కేవలం ఎంఆర్డీసీఎల్ వెబ్సైట్లో మాత్రమే ఉంచుతున్నారు. తాజాగా బయటికొచ్చిన త్రీడీ డిజిటల్ మాడలింగ్ టెండర్ నోటిఫికేషన్ చివరకు ఎంఆర్డీసీఎల్ వెబ్సైట్లో కూడా అందుబాటులో లేదు. కానీ ఈ టెండరు నోటిఫికేషన్ నంబరు (05) కంటే ముందు ఉన్న (04), ఆ తర్వాత వచ్చిన (06) నోటిఫికేషన్లు మాత్రం వెబ్సైట్లో కనిపిస్తున్నాయి. అంటే అధికారులు ఉద్దేశపూర్వకంగానే నోటిఫికేషన్‌ను గోప్యంగా ఉంచారని తేటతెల్లమవుతుంది.
ప్రపంచబ్యాంకుకు ఎంఆర్డీసీఎల్ ఇచ్చిన నివేదికలో మూసీ పరీవాహకంలో పర్యాటక, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, వినోద, రియల్ పెట్టుబడుల కోసం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం కోసం వెంచర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, ఆఫీస్ స్పేస్.. ఇలా సియోల్ తరహా అభివృద్ధి నమూనాను చేపడతామని చెప్పారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, మీడియాను సియోల్ పర్యటనకు కూడా తీసుకుపోయారు. ఇవన్నీ 50 మీటర్ల బఫర్ జోన్లో సాధ్యమయ్యేవి కాదన్నది నిపుణుల మాట. అంటే బఫర్ జోన్‌కు మించి భూములను సేకరిస్తారనేది సుస్పష్టం.
ఎంఆర్డీసీఎల్ అధికారులు తాజాగా కిలోమీటర్ పరిధిని త్రీడీ డిజిటల్ మాడలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒకవేళ బఫర్ జోన్ 50 మీటర్లే అయితే కిలోమీటర్ పరిధిలో త్రీడీ డిజిటల్ మాడలింగ్ ఎందుకనేది అసలు ప్రశ్న. అంటే నదికి రెండువైపులా కిలోమీటర్ పరిధికి ప్రాజెక్టును విస్తరించనున్నదని స్పష్టం అవుతున్నది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో నదిని ఎక్కడ, ఎంత వెడల్పున రివర్ బెడ్, ఎఫ్ఆర్ఎల్, బఫర్‌జోన్‌ను నిర్ధారించారనేది ఇప్పటికీ అటు ప్రభుత్వం గానీ, ఇటు ఎంఆర్డీసీఎల్ గానీ వెల్లడించలేదు. ఇప్పటికే చాదర్‌ఘాట్ పరిధిలో 300 వరకు పేదోళ్ల ఇండ్లను కూల్చివేసింది. అడిగితే నదిలో ఉన్న ఇండ్లు అంటూ బుకాయించింది. ఇప్పుడు బాపూఘాట్ వరకు మొదటి దశ అంటూ నదికి రెండువైపులా బఫర్‌జోన్‌ను 50 మీటర్లకు విస్తరించింది. మధు రిడ్జ్ పార్క్, హిమాయత్‌సాగర్, హనుమాన్‌నగర్ తదితర 15 కాలనీలతోపాటు ఖాళీ భూములు సేకరించనున్నట్టు కొన్నిరోజుల కిందట ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్లో పొందుపరిచారు. పైకి కేవలం 50 మీటర్ల బఫర్‌జోన్ వరకు మాత్రమే భూములను, నిర్మాణాలను సేకరిస్తామని చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కొన్నిచోట్ల 700 మీటర్ల నుంచి కిలోమీటర్ వరకు హద్దురాళ్లను పాతారని స్థానికులు వాపోతున్నారు.
50 మీటర్లే నిజమైతే నదికి రెండువైపులా కిలోమీటర్ పరిధిలోని నిర్మాణాలు, భూములను ఎందుకు డిజిటల్ మాడలింగ్ చేయిస్తున్నారనేది ప్రశ్న. గతంలో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలు సైతం నదికి రెండువైపులా కిలోమీటర్ పరిధిలోని భూములను స్వాధీనం చేసుకోనున్నారనే వాదనకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు ఎంఆర్డీసీఎల్ అధికారులు గత ఏడాది స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మూసీ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో స్పష్టంగా నదికి రెండువైపులా కిలోమీటర్ పరిధిని కారిడార్‌గా గుర్తించి, అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
ప్రపంచబ్యాంకుకు ఎంఆర్డీసీఎల్ ఇచ్చిన నివేదికలో మూసీ పరీవాహకంలో పర్యాటక, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, వినోద, రియల్ పెట్టుబడుల కోసం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్ రంగం కోసం వెంచర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, ఆఫీస్ స్పేస్.. ఇలా సియోల్ తరహా అభివృద్ధి నమూనాను చేపడతామని చెప్పారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, మీడియాను సియోల్ పర్యటనకు కూడా తీసుకుపోయారు. ఇవి 50 మీటర్ల బఫర్ జోన్లో సాధ్యమయ్యేవి కాదు. తాజాగా ఎంఆర్డీసీఎల్ అధికారులు కిలోమీటర్ పరిధిని త్రీడీ డిజిటల్ మాడలింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే నదికి రెండువైపులా కిలోమీటర్ పరిధికి ప్రాజెక్టును విస్తరించనున్నదని స్పష్టం అవుతున్నది.
మంత్రి శ్రీధర్‌బాబు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు ఎంఆర్డీసీఎల్ అధికారులు నిరుడు స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. మూసీ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో స్పష్టంగా నదికి రెండువైపులా కిలోమీటర్ పరిధిని కారిడార్‌గా గుర్తించి, అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును తెరపైకి తెచ్చినప్పటి నుంచి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న దొంగాటను ఎప్పటికప్పుడు ‘నమస్తే తెలంగాణ’ కథనాల రూపంలో ప్రజలకు వివరిస్తూనే ఉన్నది. ఇందులో భాగంగా ఏడాది క్రితమే ‘కిలోమీటర్’ గుట్టును రట్టు చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం అదేమీ లేదంటూ అధికారులతో ప్రకటనలు చేయిస్తూ, వివరణలు ఇప్పిస్తున్నది. ఈ ఏడాది జనవరిలో భూసేకరణ పరిహారంపై జీవో 168కి తెచ్చిన సవరణ ఉత్తర్వులను (జీవో-16) విశ్లేషించి, ప్రభుత్వ తెరవెనుక ఉద్దేశాన్ని (హిడెన్ ఎజెండా) ‘నమస్తే తెలంగాణ’ బయటపెట్టింది. నీటి వనరుల పరిధుల్లో (చెరువులు, నదులు, నాలాల వంటివి) సేకరించే నిర్మాణాలకు నష్టపరిహారంగా టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్)ను ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
వాటిలో రివర్బెడ్/ఎఫ్ఆర్ఎల్/ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే సబ్ రిజిస్ట్రార్ పుస్తక విలువ (సర్కారు రేటు)కు 200 శాతం పరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదేవిధంగా బఫర్‌జోన్‌లో 300 శాతం ఇస్తామని చెప్పారు. వీటితోపాటు బఫర్‌జోన్ అవతల ఉంటే 400 శాతం పరిహారాన్ని ఇస్తామని స్పష్టంచేశారు. అంటే బఫర్‌జోన్ అవతల నిర్మాణాలను కూడా తీసుకోవాలనే ఎజెండా ప్రభుత్వానికి ఉన్నందునే బఫర్‌జోన్ అవతల పరిహారాన్ని కూడా పొందుపరిచిందని అప్పట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు త్రీడీ మాడలింగ్ టెండర్లతో ఇది ఖరారైంది.
నీటి వనరుల పరిధుల్లో సేకరించే నిర్మాణాలకు నష్టపరిహారంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్‌ను ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిలో రివర్బెడ్/ఎఫ్ఆర్ఎల్/ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే సబ్ రిజిస్ట్రార్ విలువకు 200 శాతం, బఫర్‌జోన్‌లో ఉంటే 300 శాతం, బఫర్‌జోన్ అవతల ఉంటే 400 శాతం పరిహారాన్ని ఇస్తామని స్పష్టంచేసింది. అంటే బఫర్‌జోన్ అవతల నిర్మాణాలను కూడా తీసుకోవాలనే ఎజెండా ఉన్నందునే పరిహారం కూడా ప్రకటించిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.