Encounter | జమ్ము కశ్మీర్లోని కుప్వారాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. నిఘా సంస్థల నుంచి వచ్చిన పక్కా సమాచారం మేరకు.. సైన్యం, ఇతర భద్రతా దళాలు కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్లో సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయి. భారత సైన్యం చినార్ కార్ప్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు చినార్ కార్ప్స్ పేర్కొంది. ఆపరేషన్ సమయంలో అప్రమత్తమైన సైనికులు అనుమానాస్పద కార్యకలాపాలను గమనించి ఉగ్రవాదులను హెచ్చరించారని.. దాంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడినట్లు చెప్పింది. ఆ తర్వాత భద్రతా దళాలు సైతం ధీటుగా స్పందించాయని చెప్పింది. ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయని, ప్రస్తుతం సంఘటనా స్థలంలో కాల్పులు జరుగుతున్నాయని.. అదనపు బలగాలను మోహరించినట్లుగా చినార్ కార్ప్స్ వివరించింది.