హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీవీ మార్గ్‌లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతోందన్నారు. భారతదేశం మొత్తం గర్వపడే విధంగా మ్యూజియం, జ్ఞానమందిరం ఏర్పాటు చేస్తున్నాం. ఇది భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవబోతుందన్నారు. అంబేద్కర్ తత్వాన్ని మాటల్లో చాలా మంది చెప్తారు. కానీ ఆ తత్వాన్ని కేసీఆర్ ఆకళింపు చేసుకుని ముందుకు సాగుతున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆ మహానుభావుడు అంబేద్కరే కారణమని కేటీఆర్ చెప్పారు.
దేవుడు మనిషిని పుట్టించాడు.. ఆ మనిషి కులాన్ని పుట్టించాడని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన దేశంలో మనషులు కలిసి ఉండే అలవాటు లేదు.. మతం, కులం పేరుతో విడిపోతున్నారు. వాస్తవం చెప్పాలంటే.. ప్రపంచంలో ఉన్నవి రెండు కులాలు మాత్రమే.. పైసలు ఉన్నోడు.. పైసలు లేనోడు. అది మాత్రం వాస్తవం. దేశంలోని అగ్రవర్ణాల్లో ఉన్న పేదలను ఎవరూ పట్టించుకోరు. దళితుల్లో, గిరిజనుల్లో డబ్బులు ఉండి పైకి వచ్చినవారి విషయంలోనూ ఏం ఇబ్బంది ఉండదు. అందుకే డబ్బున్న వాడు.. డబ్బు లేని వాడు అనే రెండు విషయాలే ప్రధానమనేది అర్థమైందన్నారు. సృష్టించిన సంపదను సమాజంలో సమానంగా పంచగలిగితే కుల వ్యవస్థను రూపుమాపే అవకాశం ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
దేవుడు అందర్నీ సమానంగా పుట్టించాడన్న కేటీఆర్.. ఎవరికైనా రక్తం ఎర్రగానే ఉంటుందని స్పష్టం చేశారు. కులం, ఉప కులం, మతం అని పుట్టించుకున్నది మనమే అని తెలిపారు. ఆశయం గొప్పదైతే.. అన్ని రకాలుగా ఎదగొచ్చు. తెలివి ఎవడబ్బా సొత్తు కాదు. తమకున్న తెలివిని ఉపయోగించుకుని.. భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలవాలని కేటీఆర్ సూచించారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి దళితబంధు లాంటి కార్యక్రమాన్ని అమలు చేయలేదని కేటీఆర్ తెలిపారు. దళిత బంధు పథకం పట్ల కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఈ దేశంలో అట్టడుగున ఉన్నది దళితులు మాత్రమే. అత్యంత వెనుకబడ్డ దళితులను అభివృద్ది పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దళిత బంధును 40 వేల మందికి అమలు చేశాం. ఈ ఏడాది 2 లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నామని కేటీఆర్ తెలిపారు.
దళిత బంధు పథకం ద్వారా సంపదను సృష్టించే మార్గాలను వెతుక్కోవాలని లబ్దిదారులకు కేటీఆర్ సూచించారు. డిక్కీ సంస్థ ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల తయారీకి యత్నిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అవకాశాలు ఇచ్చినప్పుడు యువత అందిపుచ్చుకోవాలన్నారు. దళితబంధు లబ్దిదారులు వినూత్నంగా ఆలోచించాలి. ప్రభుత్వ రాయితీలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందాలన్నారు. అందరూ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు కొంటామనడం సరికాదు. అందరూ ఒకే బాట పడితే ప్రభుత్వం కార్యక్రమం ఉద్దేశం సఫలం కాదు. దళితబంధు విఫలమైందనే నింద తెలంగాణకు మంచిదికాదన్నారు. దళితబంధు సఫలమైతే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister @KTRTRS participated as the Chief Guest in the Birth Anniversary Celebrations of Bharat Ratna Dr. B.R. Ambedkar in Hyderabad pic.twitter.com/dY6bgaGIwh
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 13, 2022