వరంగల్‌చౌరస్తా, డిసెంబర్13 : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న తీరుగా ఉంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. వైద్యం కోసం దవాఖానలో చేరితే చికిత్స మాట దేవుడెరుగు లేని రోగాలు అంటుకునేలా ఉన్నాయని పేషెంట్లు లబోదిబోమంటున్నారు. అర్షం భరత్‌కుమార్ అనే యువకుడి కుడికాలికి సెప్టిక్ కావడంతో నెల రోజుల క్రితం దవాఖానలో శస్త్రచికిత్స నిర్వహించి కాలిని తొలగించి, ఆర్థోవార్డులో అడ్మిట్ చేశారు.
శనివారం బాధితుడు నిద్రిస్తున్న సమయంలో కుడి చేయిని ఎలుక కరువడంతో గాయమైంది. విషయాన్ని నర్సింగ్ సిబ్బందికి వివరించడంతో ఇన్ఫెక్షన్ కాకుండా ఇంజెక్షన్ చేశారు. విషయం బయటకు పొక్కడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో ఆర్ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని ఎలుకలు కరువడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యింది. వైద్యాధికారులను వివరణ కోరగా ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఘటనపై విచారణ చేపడతామని పేర్కొన్నారు.