శివారు ప్రాంతాలను బల్దియాలో విలీనం చేసిన సర్కారు చేతులు దులుపుకొంది. విలీనం తర్వాత ఎదురయ్యే ఇబ్బందులపై దృష్టి పెట్టకుండా జీవోలు జారీ చేసింది. తాంబూలం ఇచ్చాం.. తన్నుకు చావండన్నట్లు వ్యవహరిస్తున్నది. ప్రధానంగా భవన నిర్మాణ రంగంలో వచ్చిన మార్పులతో సమస్యలు ఉత్పన్నమవుతున్నా.. పట్టించుకునేవారు కరువయ్యారు. దీంతో మరో గందరగోళానికి తెరదీసినట్లుగా బల్దియాలో శివారు ప్రాంతాల విలీన ప్రక్రియ మారింది. గతంలో శివారు ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అనుమతులు వచ్చేవి. కానీ విలీనం తర్వాత కొత్త ప్రాజెక్టులకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే అనుమతులు ఇవ్వనున్నారు. కానీ పాత ప్రాజెక్టులపై నిర్ణయాధికారం ఎవరికీ కట్టబెట్టలేదు. ముఖ్యంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, మార్టిగేజ్ విడుదల విషయంలో వస్తున్న ఇబ్బందులు అటు నిర్మాణదారులతో పాటు, ఇటు అధికారులను అయోమయంలో పడేస్తున్నాయి.
-సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ)
అవుటర్ రింగు రోడ్డు వరకు బల్దియా పరిధి విస్తరించిన సర్కారు.. శివారు మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాజపత్రం విడుదల చేసింది. కానీ విలీనం తర్వాత ఎదురయ్యే సమస్యలపై ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. విలీనం జరిగిన రెండు వారాలు గడిచినా బాలారిష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే ముందస్తు ప్రణాళిక, అధ్యయనం లేకుండా అడ్డగోలుగా విలీనాన్ని చేపట్టిన సర్కారు.. అందుకు తగిన మూల్యాన్ని మాత్రం విలీన ప్రాంతాలకు చెందిన జనాలు చెల్లించాల్సి వస్తుందనే విమర్శలు వస్తున్నాయి. 650 చదరపు కిలోమీటర్ల ఉన్న బల్దియా పరిధిని 2800 చదరపు కిలోమీటర్లకు విస్తరించడంలో ఎలాంటి శాస్త్రీయ విధానాలను అమలు చేయలేదని, భవన నిర్మాణ రంగంలో పుట్టుకొస్తున్న సమస్యలతో తేటతెల్లం అవుతున్నది.
దరఖాస్తులకు చిక్కులు..
భవనం ఎత్తును బట్టి నిర్మాణ అనుమతులను స్థానిక సంస్థలు గానీ, హెచ్ఎండీఏ జారీ చేసింది. అయితే ఏడాది, రెండేళ్ల కిందట అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టులన్నీ చివర దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ చిక్కుల్లో పడుతున్నాయి. విలీనం తర్వాత హెచ్ఎండీ పరిధిలోని ఓ జోన్లో దాదాపు 50కిపైగా ఓసీలు పెండింగ్‌లో పడినట్లుగా తెలిసింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ విషయంలో మున్సిపల్ శాఖ నుంచి సమగ్రమైన విధివిధానాలు రాకపోవడంతో దరఖాస్తులు దిక్కు దివాణం లేకుండా పోతున్నాయి. విలీన జీవో జారీ చేసిన మరుసటి రోజు నుంచే మున్సిపాలిటీల నుంచి దరఖాస్తులను బల్దియాకు బదిలీ చేసింది. కానీ హెచ్ఎండీఏ వద్ద ఉన్న ఫైళ్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతోనే అనుమతులను పర్యవేక్షించేది ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఫీల్డ్ విజిట్ చేసేదెవరూ?
విలీనమైతే జరిగింది. కానీ భవన నిర్మాణ రంగంలో బాధ్యతల పంపిణీ జరగలేదు. అస్పష్టమైన విధివిధానాలతో పరిష్కారం లేకుండా పోతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు తమ ప్రాజెక్టులను పరిశీలించేది ఎవరంటూ… ? కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. నిర్మాణం పూర్తి చేసి, ఓసీ తీసుకోవాలంటే అధికారుల ఫీల్డ్ విజిట్ జరిగితే గానీ సాధ్యం కాదు.
నిరసన గళం
గందరగోళం.. అస్తవ్యస్తం.. ఆగమాగం.. ఇప్పుడు నగరంలో నెలకొన్న పరిస్థితి ఇది. డివిజన్ల పునర్విభజన అనేక తలనొప్పులు తెచ్చిపెట్టింది. సరైన ప్రణాళిక లేకుండా.. అనాలోచితంగా చేపట్టిన ప్రక్రియపై నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. శాస్త్రీయ పద్ధతిలో పునర్విభజన జరగలేదని మండిపడుతున్నారు. కాలనీలు..బస్తీలను ఇస్టానుసారం ముక్కలు చేసి.. వివిధ వార్డుల్లో కలిపి.. తమ ప్రాంత ప్రజల ఐక్యత దెబ్బతీశారంటూ కొందరు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

Ghmc
ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సరిహద్దుల నిర్ధారణ సక్రమంగా లేదని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ రహ్మత్‌నగర్ డివిజన్లో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ఎస్పీఆర్హిల్స్ను డివిజన్‌గా ప్రకటించే వరకు విశ్రమించబోమని కొత్తగా ఏర్పాటు చేసిన కార్మికనగర్తో పాటు 25 బస్తీల కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఒకే గొడుగు కింద ఉన్న ఎస్పీఆర్హిల్స్ను మూడు ముక్కలు చేశారంటూ..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పునర్విభజనపై అభ్యంతరాల గడువు ముగిస్తుండటంతో శనివారం సైతం బల్దియాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
మల్కాజిగిరి/పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 13: మల్కాజిగిరి నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన 16 డివిజన్ల కూర్పు సరిగాలేదని రాజకీయపార్టీల నేతలు, కాలనీవాసులు, సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని డివిజన్లను మార్చడం, మరికొన్నింటిని మార్చకపోవడం అనుమానాలకు తావిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లు అతిపెద్దవిగా ఉన్నప్పటికీ వాటిని మార్చకపోవడంపై రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వినాయక్‌నగర్ డివిజన్ కూర్పు సరిగా లేదని, నేరేడ్మెట్ డివిజన్ హద్దుల విషయంలో పారదర్శకత లేదని విమర్శలు వస్తున్నాయి.
మల్కాజిగిరి ప్రాంతాన్ని మరింతగా కుదించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. గౌతంనగర్ డివిజన్‌ను రెండుగా విభజించిన అధికార యంత్రాంగం, మిగతా డివిజన్లను ఎందుకు వదిలేశారనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో మూడు డివిజన్లను ఆరుగా మార్చారు. అయితే ప్రధాన ప్రాంతాలైన అల్వాల్ పేరును మార్చడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలనీల పేర్లు కాకుండా ప్రాచుర్యం కలిగిన, చారిత్రక పేర్లను డివిజన్ల పేర్లుగా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి డివిజన్‌ను రెండుగా మార్చడంతో సంఖ్య ఆరుకు పెరిగింది. డివిజన్ల పరిధి తగ్గిపోయింది.
ఆశావహులకు కలిసివచ్చిన వార్డుల విభజన
చాలవరకు డివిజన్లలో రిజర్వేషన్లపై రాజకీయ నేతల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వార్డుల విభజనతో ఎక్కువగా డివిజన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు లభించనున్నాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలో రెండు సర్కిల్స్ ఉన్నాయి. మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్లో మొత్తం 9 డివిజన్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 16కు పెరిగింది. గతంలో మల్కాజిగిరి సర్కిల్లో 6 ఉండగా ప్రస్తుతం 10కి పెరుగగా, అల్వాల్ సర్కిల్లో 3 డివిజన్లు ఉండగా, ప్రస్తుతం 6 డివిజన్లు ఏర్పడ్డాయి. దీంతో రాజకీయ నాయకుల్లో ఆశలు చిగురించాయి. 16 మందికి నూతనంగా కార్పొరేటర్లుగా అవకాశం లభించనుంది.
మూడు డివిజన్లుగా చేయాలి
ఓఆర్ఆర్ లోపలున్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పెద్దఅంబర్‌పేట కూడా అందులో చేరింది. తాజాగా కొత్త డివిజన్ల ఏర్పాటుకు హద్దులు నిర్ధారిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో 51వ డివిజన్‌గా కుంట్లూరును, 52వ డివిజన్‌గా పెద్దఅంబర్పేటను పేర్కొన్నది. కుంట్లూరు పేరుతో ఉన్న 51వ డివిజన్లో కుంట్లూరు గ్రామాన్నే చేర్చలేదు. కేవలం నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించిన దాదాపు 12 వేల పైచిలుకు ఉన్న ఓటర్లను మాత్రమే లెక్కలోకి తీసుకుని కుంట్లూరు పేరుతో డివిజన్ ఏర్పాటుచేశారు.
నాలుగు గ్రామాల విలీనానికి ముందు పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండేవి. అందులోనుంచి 2 వార్డులను హయత్‌నగర్ పరిధిలోని డివిజన్లో చేర్చారు. మరో గ్రామ పంచాయతీ సాయినగర్నుసైతం ఇంకో డివిజన్‌లోకి మార్చారు. మిగతా 22 వార్డులకు సంబంధించి దాదాపు 55 వేల పైచిలుకు ఓటర్లను మొత్తం కలిపి పెద్దఅంబర్‌పేట పేరుతో 52వ డివిజన్‌ను ఏర్పాటుచేశారు. ఇటీవల విలీనం చేసిన గ్రామాలతో కలిపి పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీని మూడు డివిజన్లుగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు, తట్టిఅన్నారం పేర్లతో విభజించి, డివిజన్లుగా ఏర్పాటుచేయాలన్నారు.
తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం గ్రామాలను కలిపి కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ కోటేశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దఅంబర్‌పేట, పసుమాముల, తారామతిపేట, బాచారం గ్రామాలతోపాటు కుంట్లూరులోని కొంత ప్రాంతాన్ని కలిపి పెద్దఅంబర్‌పేట డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే మల్‌రెడ్డిని కలిసి విన్నవించినట్టు తెలుస్తున్నది. కుంట్లూరులోని ఎక్కువ భాగం, తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, గౌరెల్లిని కలిపి కుంట్లూరు డివిజన్‌గా మార్చాలని విన్నవించారు. మరోవైపు, ఫతుల్లాగూడ, తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం గ్రామాలను కలుతుపుతూ కొత్తగా తట్టిఅన్నారం పేరుతో డివిజన్ ఏర్పాటుచేయాలని చరణ్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు శనివారం జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించారు. పాత డివిజన్లపై అభ్యంతరం తెలియజేశారు.
నింబోలి అడ్డాగా మార్చాలి
మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన తులసీరామ్‌నగర్ పేరును నింబోలిఅడ్డా డివిజన్‌గా మార్చాలి. నింబోలిఅడ్డాకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో కాచి కులస్తులు.. ఏళ్లుగా నివసిస్తున్నారని అందుకు కాచిగూడగా పేరు వచ్చిందని.. అదే విధంగా ఇక్కడ 244 సంవత్సరాల చరిత్ర గల ప్రసిద్దిగాంచిన మహంకాళీ దేవాలయం ఉంది. స్థానిక ప్రజల మనోభవాలను దృష్టిలో ఉంచుకుని తులసీరామ్‌నగర్ పేరును నింబోలిఅడ్డా డివిజన్‌గా మార్చాలి.
– పట్లూరి సతీశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు