నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 13 : రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శనివారం పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. రెమ్యునరేషన్ విషయంతోపాటు సరైన రవాణ సౌకర్యం కల్పించ లేదని, పలుచోట్ల సరిగ్గా భోజనాలు ఏర్పాటు చేయలేదని సిబ్బంది నిరసనకు దిగారు. రెండో విడత ఎన్నికల విధుల నిర్వహణకు ఆర్డర్ కాపీలను అందించడంతో మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ఎన్నికల సిబ్బంది శనివారం ఆందోళనకు దిగారు. సిబ్బందికి కేటాయించిన గ్రామాలు ఏకగ్రీవం కావడంతో విధులు వద్దని చెప్పి వెళ్లిపోవాలని అధికారులు పేర్కొంటున్నారని సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు అందించాల్సిన రెమ్యునరేషన్, డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని మండల ప్రత్యేకాధికారి, ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు.
ఎన్నికల విధుల కోసం రిజర్వు విభాగంలో కేటాయించిన సిబ్బందికి రెమ్యునరేషన్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన వెంకటాపూర్ ఎంపీడీవో రాజును ఎన్నికల సిబ్బంది నిలదీశారు. రెండో విడత ఎన్నికల్లో శనివారం ములుగు జిల్లా వెంకటాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పంపిణీ కేంద్రంలో అరకొర వసతుల కారణంగా మహిళా సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రిజర్వులో ఉన్న సిబ్బంది సెంటర్కు రావాలని పదే పదే ఫోన్లు చేసి పిలిపించి, రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఎంపీడీవో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారని పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు రమేశ్ చెప్పారు. ఉద్యోగులతో దురుసుగా ప్రవర్తించిన ఎంపీడీవోపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో పోలింగ్ సిబ్బంది భోజనం చేస్తున్న సమయంలో ఎంపీడీవో కుమారుడికి, ఎన్నికల సిబ్బందికి మధ్య గొడవ చోటుచేసుకున్నది. కొన్నిరోజులుగా కార్యాలయంతోపాటు ఎన్నికల నిర్వహణలో సైతం సిబ్బందితో ఎంపీడీవో కుమారుడు దురుసుగా ప్రవర్తిసున్నాడని పలువురు ఆరోపించారు. విధుల నిర్వహణలోఎంపీడీవో కుమారుడి జోక్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎన్నికల సిబ్బందికి బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
టాటా ఏస్ వాహనాలు అద్దెకు తీసుకుని పంపించడంపై సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో శనివారం పోలింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజనం కోసం 1,300 మంది సిబ్బంది ఎదురు చూస్తుండగా.. 800 మందికి మాత్రమే భోజనాలు తెప్పించారు. మిగిలిన ఉపాధ్యాయులు, సిబ్బంది ఖాళీ ప్లేట్లతో ఆందోళనకు దిగారు. జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. వెయ్యి మందికిపైగా సిబ్బంది ఉదయమే తరలివచ్చారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం, సగం మంది కూడా కూడా భోజనం అందలేదు. తమకు ఇచ్చే అలవెన్స్ నుంచే భోజన ఖర్చులు కట్ చేస్తూ, సరిగ్గా భోజనం పెట్టకపోవడం సరికాదని మండిపడ్డారు.