సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హత్యలు, బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌లు, హల్చల్.. ఒకటేమిటి పలు రకాల నేరాలకు గంజాయి మూలమవుతోంది. ట్రై కమిషనరేట్ పరిధిలో రోజుకొకటి చొప్పున ఇలాంటివి జరుగుతున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుండడంతో మత్తులో ఉన్నవాళ్లే రోడ్లపై గొడవలు పడుతూ..వారికి మత్తు తలకెక్కితే హత్యలు కూడా చేయడానికి వెనకాడడం లేదు. నగరవాసులతో పాటు, శివారు ప్రాంతాల్లో గంజాయిబ్యాచ్లు విచ్చలవిడిగా తిరుగుతూ అరాచకం సృష్టిస్తున్నాయి.
ఇటీవల కూకట్పల్లి హౌజింగ్‌బోర్డు పరిధిలోని ఓ కాలనీలో గంజాయిమత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. కాలనీలో ఎందుకు గొడవ చేస్తున్నారంటూ ప్రశ్నించిన ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడిచేయడంతో అతనికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మరణించాడు.
రెండువారాల కిందట బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గౌస్‌నగర్‌లో పాన్‌షాపు వద్ద గొడవలో గంజాయి మత్తులో కొందరు ఒక యువకుడిని హత్యచేశారు. హత్యకు గురైన వ్యక్తిని గంజాయి మత్తులో ఉన్న వారు బెదిరించడంతో అతను గట్టిగా రియాక్ట్ అయ్యారు. దీంతో గంజాయి బ్యాచ్ తమ వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపేశారు.
చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల మహ్మద్ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తిని గంజాయి గ్యాంగ్ కత్తులతో పొడిచి చంపేశారు. చాంద్రాయణగుట్ట సమీపంలోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో అజీజ్ గొంతుపై చాకుతో పొడిచి చంపారని, గతంలో అజీజ్ ఇదే గంజాయి బ్యాచ్‌తో తిరిగేవాడని పోలీసులు తెలిపారు.
గతనెలలో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓహాస్పిటల్ వద్ద రాత్రి సమయంలో ఆరుగురు యువకులు న్యూసెన్స్ చేస్తుండడంతో ఆసుపత్రి సిబ్బంది వారిని గొడవ చేయొద్దంటూ వారించారు. దీంతో గంజాయి తాగి ఉన్న ఆ యువకులు ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడిచేయగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.
రెండు నెలల కిందట రెజిమెంటల్ బజార్లో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. గంజాయిమత్తులో ఉండి దారిన పోయేవారిని వేధిస్తూ ఒక యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఒక హోటల్‌కు వెళ్లి అక్కడ ఇద్దరు యువకులపై దాడి చేయగా వారిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కొందరు స్థానికులు వీరిని పట్టుకునే ప్రయత్నం చేయగా అంతుచూస్తామంటూ బెదిరించారు. చివరకు పోలీసులు వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా మాకు ఇది అలవాటే.. అలా జైలుకు వెళ్లి ఇలా వస్తామంటూ చెప్పి బెదిరిస్తూ వెళ్లారు.
మొదటి పేజీ తరువాయి
నగరంలో గంజాయి వినియోగం, రవాణా కట్టడి విషయంలో పోలీసులు, అబ్కారీ శాఖల ప్రయత్నాలు ఫలించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యం గా గతంలో దూల్‌పేట గుడుంబా కేంద్రంగా ఉండగా ఇప్పుడు గంజాయికి నిలయమైంది. తమకు రావలసిన మామూళ్ల కోసం గంజాయి అమ్మకాలపై పెద్దగా దృష్టి పెట్టని ఖాకీలు అడపాదడపా దాడులు చేసి తామేదో పట్టుకున్నట్లు చూపిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. పోలీసుల తనిఖీలలో కిలోల కొద్దీ గంజాయిని పట్టుకుంటున్నప్పటికీ గంజాయి అక్రమరవాణా మాత్రం ఆగడం లేదు.
ఏపీ, ఏవోబీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి నగరానికి రోజుకు వంద కిలోల గంజాయి వివిధ మార్గాల్లో చేరుతున్నట్లు పోలీసుల అంచనా. ముఖ్యంగా గం జాయి దందా దూల్పేట్, మంగళ్‌హాట్ అడ్డాగా ఈ దందా సాగుతోంది. రెండు నెలల్లో నాలుగు హత్యలు, పదిచోట్ల గొడవలు, పదికిపైగా రోడ్డు ప్రమాదాలు, న్యూసెన్స్ ఘటనలు గంజాయి మత్తు వల్లే జరిగినట్లు పోలీసులు చెప్పారు. ముషీరాబాద్, గాంధీనగర్, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, కొత్తపేట, కర్మన్‌ఘాట్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో రేయింబవళ్లు గంజాయి పీల్చుతూ పది సంఖ్యలో ముఠాలు దారినపోయేవారిని బెదిరిస్తున్నారు.
టెస్ట్ చేయబోతే ..
రెండునెలల కిందట చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలోని పిలీదర్గారోడ్ ఆటోస్టాండ్ వద్ద గంజాయి మత్తులో ఆటోడ్రైవర్ నానారచ్చ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న పోలీసులకు మూడుచెరువుల నీళ్లు తాగించాడు. వారు టెస్ట్ చేయబోతే ఆటో అద్దానికి తలబాదుకున్నాడు. ఈ వీడియో వైరల్ అయింది.
మత్తులో బైక్ నడుపుతూ..
హబ్సిగూడ సమీపంలో ఓ యువకుడు గంజాయి మత్తులో బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ఇతరు గత కొంతకాలంగా గంజాయికి బానిసైనట్లు గుర్తించిన తండ్రి ఎన్నిసార్లు మందలించినా మారలేదు. అతనికి యాక్సిడెంట్ కావడానికి గంజాయిమత్తే కారణమని పోలీసులు చెప్పారు.
కారు బానెట్‌పైకి ఎక్కి..
నగరంలో మూసాపేట ప్రాంతంలో ఒక వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా ఒక యువకుడు వారి వాహనాన్ని అడ్డగించి కారు బానెట్‌పైకి ఎక్కాడు. పిచ్చెక్కిన వ్యక్తిలా మాట్లాడుతూ వీరంగం సృష్టించాడు. దీంతో కారులో ఉన్న మహిళలు, పిల్లలు భయంతో షాక్ గురయ్యారు. ఆ యువకుడిని కారు దిగమని ఎంత చెప్పినా వినలేదు. సుమారు గంటన్నరకుపైగా అతను హంగామా చేయగా చివరకు స్థానికులు అతనిని కారు నుంచి బలవంతంగా దించారు.
పోలీసుల నిఘా వైఫల్యం..!
నగరంలో గంజాయి బ్యాచ్‌లు రెచ్చిపోవడానికి ఒకరకంగా పోలీసు నిఘా వైఫల్యమే కారణమని నగరవాసులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు నగరంలో విజిబుల్ పోలీసింగ్, నిఘాబృందాలు చురుకుగా పనిచేసేవి. ఎక్కడికక్కడ గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు గంజాయి రవాణాను అరికట్టే ప్రయత్నం జరిగింది. కానీ ఇటీవల కాలంలో పోలీసుల నిఘా తగ్గడంతోపాటు పాతవారిని పెద్దగా పట్టించుకోకుండా, కొందరు పోలీసు అధికారులైతే గంజాయి బ్యాచ్‌లతో అంటకాగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నిచోట్ల పోలీసుల అండదండలతోనే గంజాయిబ్యాచ్లు రెచ్చి పోతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ లేకపోవడంతో పాటు పట్రోలింగ్ వాహనాలు కూడా ఎప్పుడో ఒకసారి కనిపించడం, ఒకవేళ కాలనీల్లో ఉన్నా వారు వాహనం లోపలికే పరిమితమై స్థానిక పరిస్తితులను అంచనా వేయలేకపోతున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు.