హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను అత్యంత అమానవీయ పద్ధతిలో, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పండుగపూట ముగ్గురు జర్నలిస్టుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రతిసారీ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నదని మండిపడ్డారు. జర్నలిస్టులను రాష్ట్ర డీజీపీ నేరస్తుల్లా చూడటం దురదృష్టకరమని వాపోయారు. వారికి నోటీసులిచ్చి విచారణకు పిలువవచ్చు అని, అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇండ్లకు వెళ్లడం అనేది, కచ్చితంగా అతిగా ప్రవర్తించడమేనని అభిప్రాయపడ్డారు.
వెంటనే విడుదల చేయాలి
అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏ సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ కావని, అలాంటప్పుడు పోలీసులు అర్ధరాత్రి అరెస్టులతో జర్నలిస్టులను, వారి కుటుంబాలను ఎందుకు భయభ్రాంతులకు గురిచేయాలని నిర్ణయించుకున్నారని ప్రశ్నించారు. డీజీపీ చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని, కాంగ్రెస్ పార్టీ, దాని అసమర్థ నాయకత్వం చేసే మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దని కోరారు.
ఇదేనా మొహబ్బత్ కీ దుకాన్?
‘తమ ‘మొహబ్బత్ కీ దుకాన్’ తెలంగాణ పౌరుల రాజ్యాంగ హకులను ఏ విధంగా కాలరాస్తున్నదో తమరు గమనిస్తున్నారని ఆశిస్తు న్నా’ అంటూ రాహుల్‌గాంధీని ఉద్దేశించి కేటీఆర్ ప్రస్తావించారు. మంగళవారం రాత్రి ముగ్గు రు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు అపహరించారని, జర్నలిస్టు ఇంటి తలుపులు పగులగొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కేవలం బె యిలబుల్ సెక్షన్లు ఉన్న కేసు, పోలీసులు కేవలం బీఎన్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండవచ్చు అని పేర్కొన్నారు. ‘మీడియా, డిజిటల్ మీడియాపై ఇలాంటి అణచివేత ఇప్పుడు తెలంగాణలో తమరి సహచరుడు రేవంత్ పాలనకు నిదర్శనంగా మారింది!’ అని విమర్శించారు.