సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ పోలీసులు దేశవ్యాప్తంగా 16 రాష్ర్టాల్లో ఏక కాలంలో దాడులు నిర్వహించి.. సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్త సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌ను ఛేదించారు. ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌లు, ట్రేడింగ్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయక ప్రజలను భయపెట్టి వారి కష్టార్జితాన్ని దోచుకుంటున్న ఘటనలు పెరగడంతో ఈ ఆపరేషన్‌ను రూపొందించారు. సైబర్ బారిన పడిన బాధితుల సొమ్మును మళ్లించడానికి ఉపయోగించిన 151 బ్యాంక్ ఖాతాలను గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు విభాగం.. 32 ప్రత్యేక బృదాలను ఏర్పాటు చేసి 16 రాష్ర్టాల్లో పది రోజుల పాటు దాడులు నిర్వహించారు. ఈ నేరాల్లో కీలకపాత్ర పోషించిన 104మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో అక్రమ సొమ్మును దాచడానికి తమ బ్యాంక్ ఖాతాలను ఉద్దేశపూర్వకంగా అప్పగించిన మ్యూల్ అకౌంట్ హోల్డర్లు 86 మందిని, నేరగాళ్లతో కుమ్ముక్కై నకిలీ ఖాతాలను తెరవడంలో సహకరించిన బంధన్ బ్యాంక్‌కు చెందిన ఒక రిలేషన్షిప్ మేనేజర్‌ను అరెస్ట్టు చేశారు.
దేశవ్యాప్త కేసులతో సంబంధాలు..
అరెస్టయిన నిందితులకు దేశవ్యాప్తంగా నమోదైన 1,055 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉందని, ఈ మోసాల్లో మొత్తం రూ.127కోట్ల మేర బాధితులు నష్టపోయినట్లు తాము గుర్తించామని సైబర్‌క్రైమ్స్ డీసీపీ వీ అరవింద్‌బాబు తెలిపారు. ఈ ఆపరేషన్స్ మొత్తం స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్ఎం విజయ్‌కుమార్ నేతృత్వంలో జరగగా, సీసీఎస్ అధికారులు, డీఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. దాడుల్లో 204 మొబైల్ఫోన్లు, 141 సిమ్‌కార్డులు, 152 బ్యాంక్ పాస్‌బుక్స్, 26 ల్యాప్‌ట్యాప్‌లు, రూ.36లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ అరవింద్‌బాబు తెలిపారు. సైబర్ నేరాల పట్ల సిటీపోలీస్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, ఆపరేషన్ ఆక్టోపస్ నిరంతర ప్రక్రియ అని, బ్యాంక్ అధికారులు లేదా మ్యూక్ అకౌంట్ హోల్డర్లు ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.