KTR | కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఒక అక్రమ కేసులో కేసీఆర్కు నోటీసులు ఇచ్చి డైవర్షన్ డ్రామా ఆడుదామని అనుకున్న సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టులా అదే రోజు తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అద్భుత ప్రగతిని ఎకనామిక్ సర్వే 2025-26 కళ్లకుకట్టిందని అన్నారు.
అర చేతితో సూర్యకాంతిని ఆపలేరని అంటారని.. దీనికి తగ్గట్టే కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని దాచిపెట్టాలని రేవంత్ బృందం ఎన్ని దుష్టపన్నాగాలు పన్నినప్పటికీ కుదరట్లేదని కేటీఆర్ అన్నారు. ఆర్బీఐ, నీతిఆయోగ్ వంటి మేధో సంస్థలు, ‘ది ఎకానమిస్ట్’ వంటి అంతర్జాతీయ పత్రికలు, నిపుణులు కేసీఆర్ పాలనను ఇప్పటికే వేనోళ్ల పొగిడారని గుర్తుచేశారు. తాజాగా ఈ జాబితాలో కేంద్రప్రభుత్వం వెలువరించిన ఆర్థిక సర్వే 2025-26 కూడా చేరిందని తెలిపారు. కాళేశ్వరానికి, మిషన్ కాకతీయకు కితాబు ఇచ్చాయని అన్నారు.
2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉంటే అది 2023 ఆర్థిక సంవత్సరానికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగినట్టు సర్వే వెల్లడించిందని కేటీఆర్ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్, మల్టీ పర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, చెరువుల పునరుజ్జీవనానికి ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకాలతోనే రాష్ట్రంలో సాగు విప్లవం సాధ్యమైందని ఆర్థిక సర్వే నొక్కి చెప్పిందని పేర్కొన్నారు. అలా తొమ్మిదేండ్ల వ్యవధిలోనే 89 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించడంలో కేసీఆర్ సర్కారు విజయం సాధించినట్టు ప్రశంసించిందన్నారు.
Read More : KCR | ప్రగతి మయం..కేసీఆర్ హయాం.. పార్లమెంటు సాక్షిగా ప్రశంసించిన కేంద్ర ఆర్థిక సర్వే-Namasthe Telangana